18, మే 2009, సోమవారం

కాపీ కియా రే! ఇతర భాషలనుండి ప్రేరణ పొందిన హిందీ పాటలు

ఈ విషయం మీద నవతరంగంవారు ఎప్పుడో ఒక టపా వేస్తామని ప్రకటించడం వల్ల నేను ఇంతకాలం దీనిని పట్టించుకోలేదు. అయితే దీని గురించి ఏ టపా ఈ మధ్య రానందువల్ల నేనే పోస్టుతున్నా

-------------------------------

నేను చిన్నప్పటినుండీ వింటూ పెరిగిన పాటల్లో రెండు - "టేక్సీ డ్రైవర్" చిత్రంలో "చాహె కొయ్ ఖుష్ హో" ఇంకా "చోరీ చోరి" చిత్రంలో "ఆజా సనం". ఆ రెండూ విన్నప్పుడల్లా ఒకే ట్యూంతో ఎలా ఉన్నాయా అని సందేహమొచ్చేది. అదే ప్రశ్న మా నాన్నగారిని ( 1930 ల నుండి 1970 ల దాకా దాదాపు అన్ని హిందీ పాటలూ ఆయన సేకరణలో ఉన్నాయ్) అడిగితే ఒకేరాగంలో కంపోస్ చెయ్యడంవల్ల అయ్యుండచ్చు అన్నారు. కానీ నాకు సందేహం తీరలేదు. చాలాకాలం తరవాత ఒక ఇటాలియన్ ట్యూను "తారంతెల్లా" వినడం జరిగింది. అంతే - సచిన్ దా ( యస్ . డీ. బర్మన్ ) , శంకర్ జైకిషన్ ఒకే ట్యూనుని కాపీ కొట్టి రెండూ వేరే వేరే పాటలు కూర్చారని అర్థం అయ్యింది. అప్పటినించి ఈ కాపీలపై కూపీలు లాగడం మొదలుపెట్టా. ఆ ప్రయత్నంలో నాకు తారసపడినవి ఇక్కడ ఉంచుతున్నా

ఇదిగో టారంతెల్లా ( యూట్యూబులో ఒరిజినల్ దొరకలేదు గాని దాని మిక్స్ దొరికింది)



ముందుగా నా అభిమాన సంగీత దర్శకులు ఓపీ నయ్యర్, యస్.డీ బర్మన్ లతో

ఓ.పీ. నయ్యర్:

సీ.ఐ.డీ చిత్రం లో :" యె హై బంబై మెరీ జాన్" - ఇది విన్నప్పుడల్లా నాకు "ఏట్ అ పీనట్" అనే నర్సరీ రైం గుర్తొచ్చేది. ఒక సినిమా పాటని ఎంత బినాకా గీత్ మాలా టాప్ హిట్ అయినా ఒక నర్సరీ రైంలో పెడతారా అని డౌట్ వచ్చేది. చివరికి "ఓ మై డార్లింగ్ క్లెమెంటైన్" విన్నాక అర్థం అయ్యింది నయ్యర్ సాబ్ కాపీ కొట్టారని. మీరే చూడండి










భాగం భాగ్: "హే బాబూ" - మాతృక : "హే మేంబో"


ఆర్ పార్: బాబూజీ ధీరే చల్నా : మాతృక - కిజాస్ / పెర్హాప్స్ ( డారిస్ డే)








యస్.డీ. బర్మన్:
---------------

చల్తీ కా నాం గాడీ: హం థే వో థీ - మాతృక - వాటర్ మెల్లన్ సాంగ్
ఇక్ లడ్కీ భీగీ - మాతృక - సిక్స్టీన్ టన్

జ్యూయల్ థీఫ్: ( కాపీ కాదు ప్రేరణ మాత్రమే) - బ్రిడ్జ్ ఆన్ ద రివర్ క్వాయ్


ఆర్ డీ బర్మన్:
---------------

ఈయన మరీ ఘోరం - అన్నూ మాలిక్, బప్పీ లహరి లెవెల్ ఈయనది, మక్కీకి మక్కీ కాపీ


ఈ పాట ఎక్కడయినా విన్నట్టుందా?


అవును కరెక్టే. షోలే సినిమాలో మెహ్.బూబా - దేశాన్ని ఉర్రూతలూగించిన పాట అప్పట్లో

అలగే ఆయన ఖాతాలో జమ అయిన గొప్ప పాటలు


యాదోంకి బారాత్: చురాలియా - ఇఫ్ ఇత్స్ ట్యూస్డే - "చురాలియా" కొ పంచందా నే చురాలియా :))

సనం తెఋఈ కసం: దేఖ్ తా హూ కోయ్ లడ్కీ హసీ ( - యా ముస్తఫా యా ముస్తఫా - తెలుగులో హలో హలో ఓ అమ్మాయీ

హం కిసీ సే కం నహీ: మిల్ గయా హం కో సాథీ – ABBA – Mama Mia

భూత్ బంగ్ళా: ఆవో ట్విస్ట్ కరే – Come Lets Twist Again

సాగర్: ఓ మారియ – Mamunia



సలీల్ చౌదరీ
---------------

మధుమతి: దిల్ తడప్ తడప్ కే - Szla dzieweczka do gajeczka

ఛాయా: ఇత్న న ముఝ్ సే తూ – Mozart’s 40th Symphony



శంకర్ జైకిషన్
-----------------

జాన్వర్: దేఖో అబ్ తో – Beatles – I wanna hold your hand

ఝుక్ గయా ఆస్మాన్ - కౌన్ హై జో సప్నో మే ఆయా – Marguerita

లవ్ ఇన్ టోకియో - సాయోనారా – In a Persian market

గుమ్నాం: గుమ్నాం హై కోయీ - Charade

అమన్: ఆజ్ కీ రాత్ - Too much Tequila


ఈ పాట వినండి:










అర్ధమయ్యిందా? "జబ్ ప్యార్ కిసిసే హోతా హై" లో సూపర్ హిట్ పాట "జియ హో జియహో జియ కుచ్"



ఈ కోవలోకే వస్తాయి మిగిలిన వారి పాటలు

- జబ్ కోయీ బాత్ బిగడ్ జాయే
- అజీబ్ దాస్తా హై యే
- ఉఠే సబ్ కి కదం దెఖో రంపం పం
- న బోలే తుం న మైనే కుచ్ కహా
- యే సమా సమా హై యే ప్యార్ కా

గట్రా


ఇలా రాసుకుంటూ పోతే డజన్లకొద్దీ పాటలొస్తాయ్. కానీ ఒక రెండేళ్ళ క్రితం నేనొక వెబ్ సైట్ ని చూడడం తటస్తించింది. అందులో మనవాళ్ళు కాపీ కొట్టిన పాటలన్నీ నిక్షిప్తమై ఉన్నాయి - అప్పుడప్పుడు అప్ డేట్ చెయ్యబడతాయి. అందుకే మొత్త వ్రాసే బదులు ఆ సైట్ లంకె ఇస్తున్నా - మీరే చూసుకోండి

http://www.itwofs.com/

అందులో కుడివైపున్న మ్యూజిక్ డైరెక్టర్ల మీద క్లిక్ చేస్తే వారు కాపీ కొట్టినపాటలు దర్శనమిస్తాయి :))

ENJOY!!!!!!!!

10, మే 2009, ఆదివారం

"ఆవు-పులి" కి మూలమేది?

కొన్ని గంటలక్రితం గూగుల్నుండి వీబీ సౌమ్యగారి బ్లాగులో దూకితే అందులో 2008 లో చంద్రమోహన్ గారు పెట్టిన "ఆవు-పులి" కధ కామేంట్ నా దృష్టినాకర్షించింది. దాని పర్యావసానమే ఈ టపా!

ఆవు-పులి కధ తెలియని తెలుగువాడుండడంటే అతిశయోక్తి కానేకాదు. సత్యవాక్యపాలన ఎంత శక్తివంతమైనదో వర్ణించే ఆ కధ తెలుగు వారికి తెలిసి అనంతామాత్యుడు రచించిన భోజరాజీయమనే మహాకావ్యంలోనిది. తెలుగులో మొట్టమొదటి కల్పిత కధాకావ్యం ఇది. ఈ భోజరాజీయమంటే భోజరాజు కధలేమో అని చాలామంది అనుకుంటారుగానీ అది నిజం కాదు - భోజుడికి, సర్పటి అనే ఋషికి జరిగిన వాగ్వివాదమది. అనంతామాత్యుడిచే ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దబడింది. ఈ ఆవు పులి కధను అనంతామాత్యుడు మలచిన తీరును (గోవ్యాఘ్ర సంవాదం - భోజరాజీయం) ప్రశంసిస్తూ అనేక రచనలు వెలువడ్డాయి - తెలుగు వికీపీడియాలో కూడా ఆ కధ అనంతామాత్యుడికే అన్వయించబడింది. అయితే అది అనంతామాత్యుడి కల్పితమా లేక దాని మూలం వేరే చోటా ఉందా అనే చర్చకు 40 యేండ్ల క్రితమే తెర లేచింది.

1970వ దశకం - విశాఖ జిల్లా - అనకాపల్లి పట్టణం - తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్న ఒకావిడకి ఎందుకో తెలుగులో మహత్తరమైన పరిశొధనచేసెయ్యాలనే బృహత్తరమైన అలోచన పుట్టింది. 'లేడీ' కి లేచిందే పరుగన్నట్టు వెంటనే ఆవిడ నాగార్జునా విశ్వవిద్యాలయంలో ఒక పేరుమోసిన ప్రొఫెసర్ గారిని సంప్రదించారు. ఆయన మొదట్లో "యూనివర్సిటీ కి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటూ భర్త, ఆరేడేళ్ళ కోడుకు, ఉద్యోగంతో క్షణం తీరికలేకుండా ఉన్నావిడ పరిశొధన ఏంచేస్తుందిలే?" అంటూ పెద్దగా పట్టించుకోకపోయినా, రానురానూ ఆవిడ పట్టుదల చూసి ప్రొత్సహించడం మొదలుపెట్టారు. పరిశోధనాంశం -> భోజరాజీయం. ఇద్దరూ కలిసి దానికి సంబంధించిన సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యడం మొదలుపెట్టారు.

రోజులిలా సాగుతుండగా కొన్నాళ్ళకి ఆవిడకి ఆరోగ్యం బాలేక నాలుగయిదు రోజులు ఆసుపత్రిలో ఉండవలసొచ్చింది. సరేనని సాహిత్యం పక్కనపెట్టి అక్కడ ఉన్నవాళ్ళని ఎవైనా పత్రికలు తీసుకురమ్మని అడిగితే వాళ్ళూ కాస్తా ఏ సితారో, జ్యోతిచిత్రో తీసుకొచ్చిపడేశారు. అవి చదవడం కాస్త చిరాకయినా చేయగలిగిందేమిలేక మన సదరు పరిశొధకురాలు అనంతామాత్యుడిని మర్చిపోయి నాగ్గాడు, ఎంటీవోడు, కిట్టీగాడు, జ్యోతిలచ్చిమి, జైమాల్ని మీద మసాలా చదవడం మొదలు పెట్టారు. చదువుతూ చదువుతూ ఉండగా ఒక శీర్షిక ఆవిడని ఆకర్షించింది.

అది ఒక కన్నడ సినిమాకి వచ్చిన పురస్కారం గురించి - దానికి మూలం "తబ్బిలం నినాదె మగనే" (నాయనా! అనాధవైతివా?) అనబడే నవలని, ఆ నవలకి మూలం ఆవు-పులి కధ అని అందులో వ్రాయబడి ఉంది. ఇది చదివిన వెంటనే ఆవిడ మంచం మీదనుండి ఒక్క ఎగురు ఎగిరి, (మళ్ళీ తల ఫేనుకి తగిలితే ఫేను ఎక్కడ విరిగిపోతుందోనన్న భయంతో దానిని చాకచక్యంగా తప్పించుకుని) ఒక్క ఉదుటున పెన్ను తీసి మైసూరులో ఉన్న స్నేహితురాలికి ఈ కధ గురించిన వివరాలకోసం ఉత్తరం వ్రాశారు. ఆవిడ ఇచ్చిన సమాధానం బట్టీ తెలిసినదేమిటంటే ఈ కధ కన్నడంలో కూడా ఉంది అని.

రెండు భాషల్లో ఒకే కధ ఉంది అంటే కొంపదీసి దీని మూలం సంస్కృతంలో లేదు కదా అని మన పరిశొధకురాలికి ట్యూబులైట్ వెలిగింది. వెంటనే అంధ్రా యూనివర్సిటీలో సంస్కృత భాషలో ప్రొఫెసర్ అయిన తన పెదనాన్నగారు వేలూరి సుబ్బారావుగారి సాయంతో పురాణాలని తిరగెయ్యడం మొదలుపెట్టారు. వెతకగా వెతకగా పద్మపురాణంలోనూ, స్కాందపురాణంలోను ఈ కధకి మూలం దొరికింది. అంటే దానిని అనంతామాత్యుడు "కస్టమైజ్" చేసి తన పరిసరాలకు పరిస్థితులకు అనుకూలంగా అద్భుతమైన కథ మలిచాడన్నమాట. అంటే దానర్థం ఆవు పులి కధకు మూలం మన పురాణాలేగానీ అది అనంతామాత్యుడి కల్పితం కాదనేగా?

(కాలక్రమంలో భోజరాజీయం తెలుగులో మొట్టమొదటి కల్పిత కధాకావ్యమని, ఆవుపులి కధ అనంతామాత్యుడి కల్పితం కాదని నిరూపించినందుకు ఆవిడ థీసిస్ కి పీహెచ్ డి పట్టా, తరవాత తూమాటి దోణప్ప గోల్డ్ మెడల్ కూడా రావడం జరిగిపోయింది గాని అదంతా అప్రస్తుతం)

ఈ కధంతా నాకెలా తెలుసు అని అడగబోతున్నారా? అక్కడికే వస్తున్నా ఉండండీ! ఆ నాగార్జునా విశ్వవిద్యాలయం ఆచార్యులు బొడ్డుపల్లి పురుషోత్తం, పరిశొధకురాలి పేరు సీతాలక్ష్మి (ఆవిడ మా అమ్మ).

ఈ ఆవు-పులి కధ ఇవాళ రాయడంలోకూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆవు పులితో "గుమ్మెడుపాలతో నా బిడ్డ సంతృప్తి పడునుగాని నా మాంసము మొత్తము భుజించిననూ నీ జఠరాగ్ని చల్లారదు. ప్రధమకార్య వినిర్గతి నీకునూ తెలియును కదా, అన్నా! వ్యాఘ్రకులభూషణా! చయ్యన పోయివచ్చెదను" అని తన దూడ దగ్గరకువచ్చి దూడతో అన్న మాటలను అనంతామాత్యుడు పద్యరూపంలో అమోఘంగా వ్యక్తీకరించిన తీరు మీరే చూడండి

"చులుకన జలరుహ తంతువు
చులుకన తృణకణము దూది చుల్కన సుమ్మీ
యిల నెగయు ధూళి చుల్కన
చులుకన మరి తల్లిలేని సుతుడు కుమారా"

(తామరతూడులోని దారము, గడ్డిపరక, దూది, ధూళి ఎంత చులకనో, తల్లిలేని కూడా లోకానికి అంతే చులకన కుమారా)


అలాగే సంస్కృతమూలంలో ఉన్న శ్లోకం కూడా:

"నాస్తిమాతృ సమ: కశ్చిత్ బాలానాం క్షీరజీవనం
నాస్తిమాతృ సమోనాధ: నాస్తిమాతృ సమాగతి:"

హృదయాన్ని కరిగించే ఈ మాటలు తల్లిప్రేమను ఎంత అందంగా వర్ణిస్తాయో కదా! "మదర్స్ డే" సందర్భంగా మనం గుర్తుచేసుకోవాల్సిన కధలలో మొదటిది ఇదే!