10, మే 2009, ఆదివారం

"ఆవు-పులి" కి మూలమేది?

కొన్ని గంటలక్రితం గూగుల్నుండి వీబీ సౌమ్యగారి బ్లాగులో దూకితే అందులో 2008 లో చంద్రమోహన్ గారు పెట్టిన "ఆవు-పులి" కధ కామేంట్ నా దృష్టినాకర్షించింది. దాని పర్యావసానమే ఈ టపా!

ఆవు-పులి కధ తెలియని తెలుగువాడుండడంటే అతిశయోక్తి కానేకాదు. సత్యవాక్యపాలన ఎంత శక్తివంతమైనదో వర్ణించే ఆ కధ తెలుగు వారికి తెలిసి అనంతామాత్యుడు రచించిన భోజరాజీయమనే మహాకావ్యంలోనిది. తెలుగులో మొట్టమొదటి కల్పిత కధాకావ్యం ఇది. ఈ భోజరాజీయమంటే భోజరాజు కధలేమో అని చాలామంది అనుకుంటారుగానీ అది నిజం కాదు - భోజుడికి, సర్పటి అనే ఋషికి జరిగిన వాగ్వివాదమది. అనంతామాత్యుడిచే ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దబడింది. ఈ ఆవు పులి కధను అనంతామాత్యుడు మలచిన తీరును (గోవ్యాఘ్ర సంవాదం - భోజరాజీయం) ప్రశంసిస్తూ అనేక రచనలు వెలువడ్డాయి - తెలుగు వికీపీడియాలో కూడా ఆ కధ అనంతామాత్యుడికే అన్వయించబడింది. అయితే అది అనంతామాత్యుడి కల్పితమా లేక దాని మూలం వేరే చోటా ఉందా అనే చర్చకు 40 యేండ్ల క్రితమే తెర లేచింది.

1970వ దశకం - విశాఖ జిల్లా - అనకాపల్లి పట్టణం - తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్న ఒకావిడకి ఎందుకో తెలుగులో మహత్తరమైన పరిశొధనచేసెయ్యాలనే బృహత్తరమైన అలోచన పుట్టింది. 'లేడీ' కి లేచిందే పరుగన్నట్టు వెంటనే ఆవిడ నాగార్జునా విశ్వవిద్యాలయంలో ఒక పేరుమోసిన ప్రొఫెసర్ గారిని సంప్రదించారు. ఆయన మొదట్లో "యూనివర్సిటీ కి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటూ భర్త, ఆరేడేళ్ళ కోడుకు, ఉద్యోగంతో క్షణం తీరికలేకుండా ఉన్నావిడ పరిశొధన ఏంచేస్తుందిలే?" అంటూ పెద్దగా పట్టించుకోకపోయినా, రానురానూ ఆవిడ పట్టుదల చూసి ప్రొత్సహించడం మొదలుపెట్టారు. పరిశోధనాంశం -> భోజరాజీయం. ఇద్దరూ కలిసి దానికి సంబంధించిన సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యడం మొదలుపెట్టారు.

రోజులిలా సాగుతుండగా కొన్నాళ్ళకి ఆవిడకి ఆరోగ్యం బాలేక నాలుగయిదు రోజులు ఆసుపత్రిలో ఉండవలసొచ్చింది. సరేనని సాహిత్యం పక్కనపెట్టి అక్కడ ఉన్నవాళ్ళని ఎవైనా పత్రికలు తీసుకురమ్మని అడిగితే వాళ్ళూ కాస్తా ఏ సితారో, జ్యోతిచిత్రో తీసుకొచ్చిపడేశారు. అవి చదవడం కాస్త చిరాకయినా చేయగలిగిందేమిలేక మన సదరు పరిశొధకురాలు అనంతామాత్యుడిని మర్చిపోయి నాగ్గాడు, ఎంటీవోడు, కిట్టీగాడు, జ్యోతిలచ్చిమి, జైమాల్ని మీద మసాలా చదవడం మొదలు పెట్టారు. చదువుతూ చదువుతూ ఉండగా ఒక శీర్షిక ఆవిడని ఆకర్షించింది.

అది ఒక కన్నడ సినిమాకి వచ్చిన పురస్కారం గురించి - దానికి మూలం "తబ్బిలం నినాదె మగనే" (నాయనా! అనాధవైతివా?) అనబడే నవలని, ఆ నవలకి మూలం ఆవు-పులి కధ అని అందులో వ్రాయబడి ఉంది. ఇది చదివిన వెంటనే ఆవిడ మంచం మీదనుండి ఒక్క ఎగురు ఎగిరి, (మళ్ళీ తల ఫేనుకి తగిలితే ఫేను ఎక్కడ విరిగిపోతుందోనన్న భయంతో దానిని చాకచక్యంగా తప్పించుకుని) ఒక్క ఉదుటున పెన్ను తీసి మైసూరులో ఉన్న స్నేహితురాలికి ఈ కధ గురించిన వివరాలకోసం ఉత్తరం వ్రాశారు. ఆవిడ ఇచ్చిన సమాధానం బట్టీ తెలిసినదేమిటంటే ఈ కధ కన్నడంలో కూడా ఉంది అని.

రెండు భాషల్లో ఒకే కధ ఉంది అంటే కొంపదీసి దీని మూలం సంస్కృతంలో లేదు కదా అని మన పరిశొధకురాలికి ట్యూబులైట్ వెలిగింది. వెంటనే అంధ్రా యూనివర్సిటీలో సంస్కృత భాషలో ప్రొఫెసర్ అయిన తన పెదనాన్నగారు వేలూరి సుబ్బారావుగారి సాయంతో పురాణాలని తిరగెయ్యడం మొదలుపెట్టారు. వెతకగా వెతకగా పద్మపురాణంలోనూ, స్కాందపురాణంలోను ఈ కధకి మూలం దొరికింది. అంటే దానిని అనంతామాత్యుడు "కస్టమైజ్" చేసి తన పరిసరాలకు పరిస్థితులకు అనుకూలంగా అద్భుతమైన కథ మలిచాడన్నమాట. అంటే దానర్థం ఆవు పులి కధకు మూలం మన పురాణాలేగానీ అది అనంతామాత్యుడి కల్పితం కాదనేగా?

(కాలక్రమంలో భోజరాజీయం తెలుగులో మొట్టమొదటి కల్పిత కధాకావ్యమని, ఆవుపులి కధ అనంతామాత్యుడి కల్పితం కాదని నిరూపించినందుకు ఆవిడ థీసిస్ కి పీహెచ్ డి పట్టా, తరవాత తూమాటి దోణప్ప గోల్డ్ మెడల్ కూడా రావడం జరిగిపోయింది గాని అదంతా అప్రస్తుతం)

ఈ కధంతా నాకెలా తెలుసు అని అడగబోతున్నారా? అక్కడికే వస్తున్నా ఉండండీ! ఆ నాగార్జునా విశ్వవిద్యాలయం ఆచార్యులు బొడ్డుపల్లి పురుషోత్తం, పరిశొధకురాలి పేరు సీతాలక్ష్మి (ఆవిడ మా అమ్మ).

ఈ ఆవు-పులి కధ ఇవాళ రాయడంలోకూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆవు పులితో "గుమ్మెడుపాలతో నా బిడ్డ సంతృప్తి పడునుగాని నా మాంసము మొత్తము భుజించిననూ నీ జఠరాగ్ని చల్లారదు. ప్రధమకార్య వినిర్గతి నీకునూ తెలియును కదా, అన్నా! వ్యాఘ్రకులభూషణా! చయ్యన పోయివచ్చెదను" అని తన దూడ దగ్గరకువచ్చి దూడతో అన్న మాటలను అనంతామాత్యుడు పద్యరూపంలో అమోఘంగా వ్యక్తీకరించిన తీరు మీరే చూడండి

"చులుకన జలరుహ తంతువు
చులుకన తృణకణము దూది చుల్కన సుమ్మీ
యిల నెగయు ధూళి చుల్కన
చులుకన మరి తల్లిలేని సుతుడు కుమారా"

(తామరతూడులోని దారము, గడ్డిపరక, దూది, ధూళి ఎంత చులకనో, తల్లిలేని కూడా లోకానికి అంతే చులకన కుమారా)


అలాగే సంస్కృతమూలంలో ఉన్న శ్లోకం కూడా:

"నాస్తిమాతృ సమ: కశ్చిత్ బాలానాం క్షీరజీవనం
నాస్తిమాతృ సమోనాధ: నాస్తిమాతృ సమాగతి:"

హృదయాన్ని కరిగించే ఈ మాటలు తల్లిప్రేమను ఎంత అందంగా వర్ణిస్తాయో కదా! "మదర్స్ డే" సందర్భంగా మనం గుర్తుచేసుకోవాల్సిన కధలలో మొదటిది ఇదే!

12 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది, సందర్బోచితంగా

    రిప్లయితొలగించండి
  2. చినప్పుడు బాగా బట్టి పట్టి మరి రాసి తెలుగు లో మంచి మార్కులు తెప్పించిన ఈ పద్యం సందర్భం మర్చి పోయి ప్రతి సారి చులుకన జలరుహ తంతువు అనుకుంటూ గుర్తు తెచ్చు కోడానికి ప్రయత్నిస్తుంటే ఇన్నాల్లకి మీ పుణ్యమా అని గుర్తు వచ్చింది ఈ సందర్భం గా మీకు మీ అమ్మ గారికి కృతఙ్ఞతలు . పండిత పుత్రః పరమ శుంఠ హ అన్నది అన్ని సార్లు వర్తించదని మీరు నిరూ పిస్తున్నారు .భాద్యత లెరిగిన కొడుకు కి ప్రతి రోజు mothers డే నే , ఓల్డ్ age హోమ్స్ లో చేర్పించిన వాళ్ళకే యి mothers డేస్ వర్తిస్తాఎమో .

    రిప్లయితొలగించండి
  3. భరద్వాజా, మీరేనా ఇది రాసింది? ఆశ్చర్యంగా ఉంది. :0 మంచి పద్యాన్ని గుర్తుచేశారు. మంచి టపా. ఆవిడెవరో సాగించిన పరిశోధన గురించి ఈ రౌడీకి ఎలా తెలుసా అని ఆశ్చర్యంగ చదివాను. రాసిన మీకు, పరిశోధన సాగించిన మీ అమ్మగారికి మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. :)

    రిప్లయితొలగించండి
  4. మంచి విషయాన్ని చెప్పి మంచి కథని గుర్తు చేసారు!
    భోజరాజీయం అనగానే నాకు గుర్తుకొచ్చే పద్యం:
    మునుమును బుట్టె నాకు నొక ముద్దులపట్టి యతండు బుట్టి యే
    డెనిమిది నాళ్ళపాటి గల దింతయు పూరియు మేయనేర డే
    జని కడుపార జన్ గుడిపి చయ్యన వచ్చెద నన్ను బోయిర
    మ్మని సుకృతమ్ము గట్టుకొన్నుమన్న దయాగుణ ముల్లసిల్లగన్!

    రిప్లయితొలగించండి
  5. చాలా సంతోషం. మంచి కథనీ పద్యాల్నీ గుర్తు చేశారు. ఏ తరగతిలోనో గుర్తు లేదు కానీ ఇది తెలుగు వాచకంలో ఉండేది. మీ అమ్మగారిక్కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  6. అందరికీ ధన్యవాదాలు. పీహెచ్ డీ వైవా సమయంలో ఈ పద్యానికి అర్ధం వివరించమని మా అమ్మగారిని ఎడ్యూడికేటర్లలో ఒకరయిన ఆచార్య గంటి జోగిసోమయాజిగారు అడిగార్ట:))

    అరుణగారూ, అంటే మీ ఉద్దేశ్యం నేనిలాంటివి వ్రాయకూడదనా? :)) ఎప్పుడూ కెలుకుతుంటే బోరు కదా అని ఎదో కాస్త అలికా అంతే :))

    రిప్లయితొలగించండి
  7. http://www.youtube.com/watch?v=Fs-Jzh5KBvM
    Is this yours? just curious where you got the original song from? Are there more songs like this?

    రిప్లయితొలగించండి
  8. The song is not mine. Just mixed it with the Michael Jackson video. It seems it was sung by somebody called MegaGB. Even the writer Mr. Vijayendraprasad (Of Vikramaarkudu fame) spoke to me regarding this and we are yet to trace this man MegaGB out! Somebody emailed me the Mp3 version of this song.

    The only other song that sounds similar to this is the audio for my remix "Aspiring Politicians Remo Mix"

    రిప్లయితొలగించండి
  9. Hi Malakpet Rowdy garu,

    I am MegaGB. If you are referring to "yenkamma" song, it is not mine.I have composed other songs, but this is not my work. You must be confused.Take it easy.

    రిప్లయితొలగించండి
  10. ఈకథచదువుతుంటే చిన్ననాటి జ్ఞాపకాలు తళుక్కున మెరిశాయి.ఈకథ నేవు చదివేనాటికి మా అమ్మగారు గతించారు.ఈకథచదువినప్పుడల్లా ఏడ్చేదాన్ని.నాకు ఆవుదూడలంటే చాలా సరదా ప్రేమ.

    రిప్లయితొలగించండి
  11. ఈకథచదువుతుంటే చిన్ననాటి జ్ఞాపకాలు తళుక్కున మెరిశాయి.ఈకథ నేవు చదివేనాటికి మా అమ్మగారు గతించారు.ఈకథచదువినప్పుడల్లా ఏడ్చేదాన్ని.నాకు ఆవుదూడలంటే చాలా సరదా ప్రేమ.

    రిప్లయితొలగించండి
  12. చులకన జలరుహ తంతువు ఫద్యం సగమే గుర్తుంది చిన్నప్పటి పాఠ్యాంశం ఇన్నిరోజులకు చదివేను ధన్యవాదములు

    రిప్లయితొలగించండి