20, ఏప్రిల్ 2009, సోమవారం
ఆవకాయ డాట్ కాం - బొల్లోజు బాబా ఇంటర్వ్యూ
An Extract from http://www.aavakaaya.com
కవి పరిచయం:
"అప్పుడప్పుడూ ఆలోచనలను అక్షరబద్ధం చేయడం" తన కిష్టమైన అభిరుచి అని సరళంగా తమ పరిచయం చేసుకునే శ్రీ బొల్లోజు బాబాగారు ఇంటర్నెట్ సాహిత్య పాఠకులకు, పఠన ప్రియులకు సుపరిచితులు. సాహితీయానం అనే తమ బ్లాగు ద్వారా తమ ఆలోచనలను అక్షరబద్ధం చేయడమే కాక వివిధ వెబ్ సైట్లలో కూడా ఉత్సాహంగా పాల్గొని తమ రచనలను, అభిప్రాయాలనూ నిష్కర్షగానూ, సున్నితంగానూ పంచుకొంటున్నారు.
కవులను పాఠకులకు మరింత దగ్గరగా తీసుకువెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఆవకాయ.కామ్ ఆయా కవులను ఇంటర్వ్యూ చేస్తోంది. ఈ ప్రయత్నం శ్రీ ఇక్బాల్ చంద్ తో ప్రారంభమై శ్రీ బొల్లోజు బాబాగారి ద్వారా మరో మజిలీకి చేరుకుంది. పాఠకులతో తమ భావాలను పంచుకోవడంలో ఆవకాయ.కామ్ ను వేదికగా అంగీకరించిన శ్రీ బాబాగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి ఇంటర్వ్యూను మొదలు పెడదాం...
ప్రశ్న 1: చదువు, ఉద్యోగం, ప్రవృత్తి, అభిరుచులు...అన్నీ పరస్పర భిన్నాలని నేటి కాలపు జీవన స్థితిగతులు నిరూపిస్తున్నాయి. ఇన్ని వైరుధ్యాల మధ్యనే జీవనాన్ని సాగిస్తూ కూడా సాహిత్యం పట్ల ప్రత్యేకమైన ఆసక్తిని పెంపొందించుకున్న వారిగా కవిత్వం పట్ల మీ ఆలోచనలను మాతో పంచుకోగలరా?
.
-- Editor Avaka
బొల్లోజు బాబా:
జ: నా ఉద్యోగం నే చదివిన చదువుకు సంబంధించినది అవ్వటం ఒక అదృష్టం. జీవితంలోని వైరుధ్యాలు నిరంతరం ఆలోచింపచేస్తూంటాయి. కవిత్వానికి కావల్సిన ముడిసరుకును అందిస్తూంటాయి. అలాంటి వైరుధ్యాలవలననే, చలం చెప్పిన అంతర్-బహిర్ యుద్దారావం సాధ్యమౌతుంది..
కవిత్వం గురించి రాబర్ట్ ఫ్రాస్ట్ అనే ఆయన Poetry is when an emotion has found its thought and the thought has found words. అని అంటాడు. అలాంటి అనుభూతిని సమర్ధవంతంగా అక్షరీకరించి, సార్వజనీజం చేసి ఆ అనుభూతిని అదే స్థాయిలో చదువరిలో ప్రవేశపెట్టగలిగేవాడే గొప్ప కవి. ఇది ఒక తిలక్, ఒక ఇస్మాయిల్, ఒక శిఖామణి, ఒక పాబ్లో నెరుడా లు చేసారు.
కవి అనే వాడు నిత్యం తనని తాను రహస్యంగా చూసుకొనే వోయూరిస్ట్ లాంటి వాడు. అందుకనే ఇస్మాయిల్ ఒకచోట "క్షణక్షణం మనల్ని ప్రత్యక్షంగా తాకే అనుభవాలూ, వాటి స్పందనలూ, జీవితాన్ని జీవనపాత్రంగా మార్చే అనంతమైన అనుభూతులూ, ఇవి కాక కవిత్వానికేవీ అర్హం?" అని ప్రశ్నిస్తాడు.
కవిత్వం మానవ నాగరికతకు పాలమీగడవంటిది. కవిత్వ ప్రయోజనం అందం ఆనందం అని కొందరు, లేదు దీనికి సామాజిక ప్రయోజనం కూడా ఉండాలని మరికొందరు అంటారు. ఏది ఏమైనప్పటికీ, కవిత్వం జీవితాన్ని భిన్న కోణాలలో దర్శించగలిగేలా చేస్తుంది. చదువరి హృదయానికి సున్నితత్వాన్ని కలిగిస్తుంది. ఇంతకు మించి కవిత్వం నుంచి ఏ ప్రయోజనం కావాలి?
ప్రశ్న 2: చక్కగా చెప్పారు. మీ "సాహితీయానం"లోని కొన్ని మరపురాని మజిలీలలో మరోసారి ఆగి, మమ్మల్నీ తీసుకెళ్ళండి.
జ: నేను కేంద్రపాలితప్రాంతమైన యానం లో పుట్టి పెరిగాను. పోస్ట్ గ్రాడ్యుయేషనుకు పాండిచేరీ వెళ్లాను. ఆ తరువాత ఉద్యోగరీత్యా తూర్పుగోదావరి జిల్లాలో స్థిరపడ్డాను. (ప్రస్తుతానికి).
కాలేజ్ మాగజైన్ లలో నే వ్రాసిన కవితలు, నాపేరుతో నా మిత్రులపేరుతో అచ్చవటం ఒక ముచ్చట. తొంభైల ఆరంభంలో పత్రికలకు పంపేవాడిని. కొన్ని అచ్చయ్యాయి. చాలా తిరిగొచ్చేవి. తరువాత ఉద్యోగానికై పోరాటం, పెళ్ళి, పిల్లలు వంటి సాంసారిక విషయాలవల్ల, అనుభూతులన్నీ డైరీలకే పరిమితమైపోయాయి.
2007 లో కొంతమంది మిత్రుల ప్రోద్భలంతో, "యానం విమోచనోద్యమం" అనే పుస్తకాన్ని రచించాను. ఫ్రెంఛి పాలన నుండి 1954 లో యానం ఏవిధంగా విమోచనం చెందింది, ఆనాడు జరిగిన ఉద్యమంలో జరిగిన విశేషాలు, ఉదంతాలను, పత్రికా వార్తలను అన్నీ క్రోడీకరించి, పుస్తకంరూపంలోకి తీసుకురావటం జరిగింది.
గత సంవత్సరం ఇదే నెలలో అంతర్జాల ప్రపంచంలోకి ప్రవేశించి, నా భావాలను బ్లాగులద్వారా వెలువరించటం మొదలు పెట్టాను. ఆ క్రమంలోనే ఆవకాయ్.కాం ఇచ్చిన స్నేహహస్తాన్ని అందుకొన్నాను. నేనీ రూపంలో ఇలా మీతో సంభాషిస్తున్నానంటే కారణం అంతర్జాలమే.
ప్రస్తుతం వివిధ పత్రికలలో అచ్చయిన కొన్ని కవితలు మరియు ఇతర కవితలను కలిపి కవితా సంపుటి తీసుకు రావాలని భావిస్తున్నాను.
గత సంవత్సరం నేచేసిన "టాగూర్ స్ట్రే బర్డ్స్" తెలుగు అనువాదం, ఈ అంతర్జాల సాహితీ మిత్రుల ప్రోత్సాహం వలననే అని భావిస్తున్నాను.
ప్రశ్న 3: పత్రికా రంగంతో సరిసమానంగాను, ఒక్కోసారి అంతకంటే ఎక్కువగానూ ఇంటర్నెట్ లో సాహిత్య కృషి జరుగుతోంది. ఇంటర్నెట్ సాహిత్యరంగంలో విరివిగా పాల్గొంటున్న మీరు ఇప్పుడు వస్తున్న e-సాహిత్యం గురించి వివరించగలరా?
జ: అంతర్జాలంలో వస్తున్న సాహిత్యం, పత్రికలలో వచ్చే సాహిత్యానికి ఏమాత్రం తీసిపోదు. అక్కడకూ ఇక్కడకూ ప్రధానమైన వ్యత్యాసం ఏమిటంటే చదువరికి రచయితకూ, లేదా చదువరులకూ మధ్య జరిగే సత్వర ఇంటరాక్షన్. ఈ ఇంటరాక్షన్ వల్ల ఒక కవిత పై దాని రచయితకున్న అనుమానాలు కానీ అహంకారాలు కానీ పటాపంచలవుతాయి. భిన్న కోణాలలో తన కవిత ఆవిష్కరింపబడటం అనేది ఏ కవికి ఆత్మతృప్తినియ్యదూ! అంతర్జాలంలో సాహిత్యం పట్ల అభినివేశం కలిగిన పాఠకుల అభిప్రాయాలు ఎల్లప్పుడూ క్షీర నీర న్యాయానికి అనుగుణంగా నే ఉంటున్నాయి
.
అలోక్ గారు,, రఘోత్తమరావుగారు, భూషణ్ గారు ఇక్బాల్ చంద్ గారు కొత్తపాళీగారు, భైరవభట్ల గారు, సుజాత గారు, రాఘవగారు, మాగంటి గారు, చంద్రమోహన్ గారు, నిషి గంధ గారు, స్వాతి గారు, వంటి వారు అంతర్జాలంలో మనకు తారసపడే కొంతమంది సాహితీ సహృదయులు మరియు కవులు
ఇకపోతే అంతర్జాలంలో మంచి కవిత్వం వెలువడుతుంది. ఈ విషయంలో ఆవకాయ్.కాం, ఈమాట, పొద్దు, ప్రాణహిత, కౌముది వంటి పత్రికలు మరియు ఆ యా రచయితలు స్వయంగా నిర్వహించుకొనే బ్లాగులు ప్రముఖ పాత్ర వహిస్తున్నవి. ఉదాహరణకు, ఈ క్రింది బ్లాగులు ఉత్తమ ప్రమాణాలు కలిగిన కవిత్వాన్ని అందిస్తున్నాయి.
ఏటిఒడ్డున, జాన్ హైడ్ కనుమూరి, స్నేహమా ...రాధిక, లాలిత్య - కవిత్వం, కల్హార , యామిని , మానస వీణ ఆత్రేయ , మరువం పద్మార్పిత మొదలగునవి.
ప్రశ్న 4: కవులకు, పాఠకులకు సత్త్వర సంపర్కాన్ని కల్పించడమే ఇంటర్నెట్ మాధ్యమానికి ఉన్న గొప్ప అడ్వాంటేజ్.
ఇప్పుడు కాస్త ఇబ్బందికరమైన ప్రశ్నే కానీ అడగాలని ఉంది.
"మంద: కవి యశో ప్రార్థి" అని కాళిదాసు వినమ్రతను ప్రదర్శించాడు. అంటే కవిగా తన సహృదయతను స్వవిమర్శనా పద్ధతిని ప్రకటించాడు. నేటి కాలపు కవులలో ఈ సహృదయతను చూస్తున్నామా?
జ: తెలుగు కవిత్వం వాదాల ఊబిల నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నదనిపిస్తుంది.(ఇప్పుడు మరలా ప్రాంతీయవాదాలు కొత్తగా పుట్టుకొచ్చాయి. దీనికి సిద్దాంతాల ప్రాతిపదిక ఉండదు కనుక కవిత్వానికేమీ హాని కలుగకపోవచ్చు) ఒక భావజాలాన్ని గొప్ప ఫోర్స్ తో, నవ్య రీతులతో వ్యక్తీకరించటం దిగంబరకవిత్వం తో మొదలైంది. తరువాత తరువాత స్త్రీవాదం, దళితవాదం, బహుజనవాదం, ముస్లిం వాదం, తెలంగాణా వాదం ఒక్కొక్కటి ఒక్కో ఉత్తుంగ తరంగం లా లేచాయి. ఎప్పుడైతే కవి ఒక వాదానికి పరిమితమౌతాడో అవే ప్రతీకలు, అవే ఆలోచనల చుట్టూ తిరుగుతూ తనచుట్టూ గోడలు కట్టుకోవటం సహజమే. తాను నమ్మిన సిద్దాంతాలకోసం రాద్దాంతాలు చేయటం కూడా అందులో భాగమే. సహృదయత కలిగిన తెలుగు పాఠకులు అన్నిరకాల కవులనూ అర్ధం చేసుకొని ఆదరించారనే అనిపిస్తుంది. ఆ రకంగా కవులకంటే పాఠకులే ఎక్కువ సహృదయతను ప్రదర్శించారనే అనుకోవచ్చు.
ఆ యా వాదాలపట్ల పాఠకులలో ఒక బెంట్ ఆఫ్ మైండ్ ని కలిగించటంలో అట్టి సాహిత్యం దోహదపడిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ రకంగా కొన్ని కోణాలకే పరిమితమైన అటువంటి సాహిత్యం తన లక్ష్య సాధనలో సఫలీకృతమైనట్లే. ఒకరకంగా చూస్తే ఇక్కడ ఎక్కువ సహృదయతని ప్రదర్శించింది పాఠకులే. లాక్షణికులు ఏనాడో అదే నిర్ధేశించారుకదా.
అజంతా, తిలక్, చలం (చలాన్ని రచయితగా కంటే కవిగానే నేనెక్కువ ఇష్టపడతాను) ఇస్మాయిల్, కొప్పర్తి, హెచ్చార్కె, జింబో, చిన వీరభద్రుడు, కొత్తపల్లి, రేవతీ దేవి, రవిశంకర్, ఆకెళ్ల రవిప్రకా ష్ వంటి వారల కవిత్వం, కరుణ, మానవత్వం సాహిత్యానికి ముఖ్యం అనే విషయాన్ని స్ఫష్టం చేస్తూనే ఉంది.సద్విమర్శ ను స్వీకరించటానికి కవి ఎప్పుడూ సిద్దంగానే ఉంటాడు. కానీ తాను నమ్మిన భావజాలాన్ని ప్రశ్నించే విమర్శను అతను తిప్పికొట్టటం తప్పుకాదుగా.
ప్రశ్న 5: "తాను నమ్మిన భావజాలాన్ని ప్రశ్నించే విమర్శను అతను తిప్పికొట్టటం తప్పుకాదుగా." - మరో సుదీర్ఘ చర్చకు తెర తీసారు. త్వరలో ఈ విషయంపై మరికొద్దిమంది కవులతో ఆన్ లైన్ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఆవకాయ.కామ్ ప్రయత్నిస్తుంది.
మళ్లీ ఇంటర్వ్యూలోకి...క్లుప్తత పై మీకు కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నట్టు మీ కామెంట్స్ ద్వారా తెలిసివస్తోంది. మీ ప్రశ్నలను, వాటికి వచ్చిన సమాధానాలను సరిపోల్చినపుడు మీలో పుట్టుకొచ్చిన కొత్త ప్రశ్నలేవైనా ఉన్నాయా?
జ: అవునా? ఏమో మీరు రెట్టించినతరువాత కూడా అలానే అనిపిస్తుంది. ఒక భావజాలాన్ని నమ్మి అందులోతనకు తాను చిక్కుకొన్నప్పుడు దానిని తన శక్తి అంతటితోనూ సమర్ధించుకోవాలిగా? అలాంటప్పుడు నమ్మటం వృధాయేగా?
"కవిత్వంలోనూ జీవితంలోనూ, economy of words and thoughts లేకపోవటం ఆత్మలోకంలో దివాలా" అన్న చలం మాట ఎప్పటికీ అనుసరణీయమే. కాకపోతే క్లుప్తత పేరుతో కవితను ఒక జడపదార్ధంలా మార్చి పాఠకులకు అందించటం ఒకింత బాధకలిగించే విషయం.
ఈ అంతర్జాలంలోకి రాకముందు అలాంటి కవితలు తారసపడితే, ఏమో ఈ కవితలో గొప్ప అర్ధమేదో ఉండే ఉంటుంది. నా బుర్రకే అర్ధంకావటం లేదేమో అనుకొనే వాడిని. కానీ ఇక్కడ కవిత్వంపై జరిగే చర్చలను గమనించిన తరువాత అలాంటి కవితలకు భిన్న పాఠకులు చెప్పే పరస్పరవిరుద్దమైన భాష్యాలు చదివినపుడు, అటువంటి పరిస్థితి ఏర్పడటానికి కారణం, క్లుప్తత పై కవికున్న అతి ప్రేమే అనిపిస్తోంది. (చూడుడు: ఈ మాట అంతర్జాల పత్రికలో పలు కవితలపై జరిగిన వాదోపవాదములు)
భిన్న పొరలలో ఆవిష్కరింపబడేదే గొప్ప కవిత్వం అన్న మాట సత్యమే కావొచ్చు. కానీ ఆ భిన్న పొరలు ఆ కవితయొక్క బరువు వల్ల కాక అస్పష్టత వల్ల ఏర్పడటం అనేది దారుణం.
కవి తాను పొందిన అనుభూతిని లేక కనుగొన్న సత్యాన్ని కానీ యధాతధంగా తన కవిత ద్వారా చదువరిలో ప్రవేశపెట్టగలగాలి. ఈ ప్రక్రియ సమర్ధవంతంగా చేయలేనినాడు అట్టి కవిత, విడిగా వివరణ ఇచ్చుకోవాల్సిన ఒక పొడుపుకధగా మారిపోతుందని నా అభిప్రాయం.
చివరి ప్రశ్న : "కవిగా, చదువరిగా, వ్యాఖ్యాతగా ఆవకాయ.కామ్ లో పాల్గొంటున్న మీరు ఆవకాయ.కామ్ మెరుగులు, తరుగులు, లోటుపాట్లు తెలియజేయగలరా!
జ:ఆవకాయ.కామ్ కు నిర్ధిష్టమైన ప్రమాణాలతో నడపబడుతుంది. ఉత్తమాభిరుచి గల పాఠకులను కలిగిఉంది.
దీనికి రావలసినంత ప్రచారం రాలేదేమోనని నా అభిప్రాయం.(క్షమించాలి) ప్రస్తుతం అంతర్జాలాన్ని సాహిత్యపఠనం కోసం ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతున్నది. వీరంతా కూడలి, జల్లెడ వంటి అగ్రెగేటర్ల చుట్టూ తిరుగుతూ అక్కడి నుంచి వివిధ బ్లాగుల్లోకో లేక సైటుల్లోకో వెళుతున్నారు. ఆవకాయ్.కాం కూడా అటువంటి అగ్రెగేటర్లతో (పొద్దు, ప్రాణహిత ల వంటి వెబ్ పత్రికలలా) అవగాహనకొచ్చినట్లయితే ఇంకా మరింత మందికి అందుబాటులోకి వచ్చే అవకాసం ఉంటుందని నా అభిప్రాయం. దీనికి అడ్డుపడే సాంకేతికాంశాలేమైనా ఉంటాయేమో నాకు తెలియదు మరి.
ముగింపు : బాబాగారూ, ఆవకాయ.కామ్ పట్ల మీకు గల అభిమానానికి మా కృతజతలు. మీ సూచనకు, మీ సమయాన్ని మా కోసం వెచ్చిచింనందుకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
-- Editor Avakaaya
నా భావాలను పంచుకోనేందుకు ఇంత చక్కని వేదిక నిచ్చిన ఆవకాయ్.కాం వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఈ అవకాశాన్నిచ్చిన ఎడిటర్ గారికి ధన్యవాదములు.
-- బొల్లోజు బాబా
***************************************************************************
All rights - Avakaya.com - A website managed by Cuddapah Raghottama Rao and Kondamudi Saikiran Kumar
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)