14, మార్చి 2009, శనివారం

నేను సైతం శ్రీశ్రీ గారికి క్షమాపణలతో ...

నేను సైతం కులమతాలకు లొంగిపోయి ఓటు వేశాను
నేను సైతం నీతి లేని నాయకులనే ఎన్నుకున్నాను
నేను సైతం పచ్చనోట్ల జిలుగుబిలుగుల కమ్ముడుపోయాను
నేను సైతం దేశమాతకు లెక్కలేని తూట్లుపొడిచాను


శిశిర ఋతువే గ్రీష్మమైనా ధరణీతాపం గుర్తురాలేదే!
మంచుకొండలు కరిగిపోయినా రాతిమనసులో చలనమేలేదే!
లక్షలాది రూకలముందు భూమి విలువే తెలియనేలేదే!
నేను సైతం మానవాళి అంతానికి కారణమయ్యాను

లంచగొండులు డబ్బులడిగితే నాకునేనుగా ఒప్పుకోలేదా?
తక్కినవారిని సైతమీదారిలో వెళ్ళమనినే ప్రోత్సహించలేదా?
దేశవ్యాప్త మహమ్మారి అవినీతికినే కారణంకాదా?
నేను సైతం కోరి నీతిని హత్యచేసిన భ్రష్టుడనయ్యాను

సాటినరులే నేలకూలినా అంతరాత్మకి జాలిలేదసలు
నాకు ముఖ్యం ప్రపంచంలో నేను నా భార్య నా సుతులు
ఎక్కడైనా ఎప్పుడైనా కానరావే మానవుల వెతలు
నేను సైతాన్ జన్మనెత్తి నాకు నేనే శత్రువయ్యాను!

23 కామెంట్‌లు:

  1. నేను సైతం ఒక్క కామెంట్......

    రౌడీ రాజ్య ఆవేదన
    మత జాడ్య నివేదన
    ధనజాల ధరణిలో
    ఓడిపోయిన మానవత్వం.

    అలుపెరుగని ధరిత్రి
    భరించలేదా భ్రష్టులను,బాధాతప్తులను,
    బ్రహ్మాండ నాయకులను, బరితెగించిన మనుషులను?

    అరిచినా, కరిచినా,రాసినా,రచనల రక్కినా
    పోయేదేముంది?
    రెండు వాక్యాలు, రెండు సిరా చుక్కలు

    ఏమీచేయలేని దుస్థితిలో
    అంతర్జాల విపనిలో
    కుక్కలమై మొరుగుతున్నాము
    నక్కలమై ఊళ పెడుతున్నాము.

    రిప్లయితొలగించండి
  2. Thanks Agnyata and Minerva...

    Wow Bhaskar Ramireddy garu, Thats a nice one!!!

    రిప్లయితొలగించండి
  3. simply superb రౌడీ గారు.
    - ఒక సగటు స్వార్థపరుడు

    రిప్లయితొలగించండి
  4. బాగుంది బాసూ,

    త్యాగరాజ వారు కూడా ఇలానే బాధపడ్డారు, "దుడుకు గల" అని :)

    రిప్లయితొలగించండి
  5. well done.
    కాస్త శ్రద్ధ పడితే మాత్రల లెక్క కూడా మూలానికి తగినట్టు సాధించగలిగి ఉండేవారు.
    శ్రీశ్రీని అనుకరించడంలో ఉన్న మజా అంతా ఆ తూగులోనే కదా!

    రిప్లయితొలగించండి
  6. Thx Agnyaata, Vijayamohan, Kottapaali gaarlaki

    Will try to improve on the next one!

    రిప్లయితొలగించండి
  7. చాలా బాగుందండి... ప్రతీ సగటు స్వార్థపరుడైన పౌరిడికి చెప్పుతో కొట్టినట్టు ఉంది...

    రిప్లయితొలగించండి
  8. నేను సైతం చదివాను
    నేను సైతం అబినందిస్తున్నాను
    చాలా బాగుంది రౌడి కవిగారూ

    రిప్లయితొలగించండి
  9. చాలా బాగా రాసారు. మరి మీ కోపం గురితప్పుతో౦దా?

    రిప్లయితొలగించండి
  10. సగటు మానవుడి ఆవేదనా ఇది? చాలా చక్కగా అక్షర బద్ధం చేశారు. భాస్కర్ రామి రెడ్డి గారు..మీరు కూడా! .

    రిప్లయితొలగించండి
  11. భరత్వాజ్ గారు మీరు చాలా బాగా రాస్తారు.. మరెందుకని ఇలాంటివి ఎక్కువగా రాయరు.చాలా బాగుంది .

    రిప్లయితొలగించండి
  12. అయ్యో నాకంత సీన్ లేదండీ. అ రోజేదో కవిత చదివి ఆ మూడ్ లో వ్రాశానంతే. Thank you.

    రిప్లయితొలగించండి