28, నవంబర్ 2009, శనివారం

2012 - నిజమా లేక కట్టుకధా?

http://nagarajur.blogspot.com/2009/11/2012.html బ్లాగులో నాగరాజు రవీందర్ గారి ప్రశ్నలకి నాకు తెలిసిన సమాధానాలు:



1. దక్షిణ అమెరికాలో నివసించే 'మాయా' తెగల పంచాంగం ప్రకారం డిసెంబర్ 21, 2012 ప్రపంచానికి ఆఖరి రోజు
________________________________________________________________________

అది వారి కేలండర్ కి ఆఖరి రోజు - అంటే, వారి సైకిల్ కి అంతం - నిజానికి అదొక పర్వదినం వారికి. అయితే దానిని ప్రపంచానికి ఆఖరి రోజుగా మిగతావారు అన్వయిస్తున్నారు


2. ఖగోళ శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం, 2012 లో సౌర తుఫానులు తీవ్ర రూపం దాల్చుతాయి. అవి ఇప్పటికే భూమి, మరికొన్ని గ్రహాలపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి.
___________________________________________________________________________________________________________

మన సూర్యుడు చాలా స్థిరమైన సూర్యుడు. మనకి 135 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న "పెగసీ" అనబడె తార మనకి అతి దగ్గరగానున్న అస్థిర సూర్యుడు. ఆ తార మన సూర్యుడి స్థానంలో ఉంటే భూమి తుడిచిపెట్టుకుపోయేదేమో గాని, మన సూర్యుడికి అంత "సీన్" లేదు :))


3. శాస్త్రజ్ఞులు 2012లో అణు రియాక్టర్ ( ళ్ఛ్) లో ఒక గొప్ప అణువిస్ఫోటనం గావించి , విశ్వం యొక్క పుట్టు పూర్వోత్తరాలను కనుగొనబోతున్నారు. ఈ అణు రియాక్టర్‌ను ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల భూగర్భంలో 27 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో నెలకొల్పారు. అక్కడ ఇప్పటికే కొన్ని పరీక్షలను జరుపుతున్నారు. ఐతే కొందరు 2012లో జరుపబడే ఈ అణుపరీక్ష వికటించి, సమస్త జంతుజాలం నశించిపోతుందని చెబుతున్నారు.
__________________________________________________________________________________________________________________

ఇది మరీ ఊహాజనితంగా ఉంది. వికటీంచేది రేపైయినా వికటించవచ్చు. అసలు ఈ పరీక్ష మొదలయిన రోజునే వికటిస్తుంది, ప్రపంచం అంతమైపోతుంది అని చెప్పిన వాళ్ళు ప్రస్తుతానికి మాట్లాడడం లేదు.


4. బైబిల్ ప్రకారం 2012లో మంచీ - చెడుల మధ్య ఆఖరిపోరాటం జరగబోతోంది. హిందూ శాస్త్రాలలో కలికి అవతారం గురించి, " మ్లేచ్చ నివహ నిధనే కలయసి కరవాలం; ధూమకేతుమివ కిమపి కరాళం" అని ఉండనే ఉంది.
మరికొందరి అభిప్రాయం ప్రకారం, మానవాళి పూర్తిగా నశించదు. కాని వారిలో ఒక గొప్ప నూతన ఆధ్యాత్మిక మార్పు వస్తుంది. శ్రీ అరబింద్ ఘోష్ కూడా " మనిషి ఏదో ఒకరోజు సుప్రమెంతల్ స్థితిని అందుకోగలుగుతాడు " అని చెప్పారు.
_________________________________________________________________________________________________________________

అవి చెప్పినవేమిటో, వాటిని మనం ఏ విధంగా అన్వయించుకుంటున్నామో, దేవుడికే ఎరుక.


5. అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎప్పుడూ వేడినీటి బుగ్గలను విరజిమ్ముతూ ఉంటుంది. దీనికి కారణం అది సరిగ్గా ఒక అగ్నిపర్వతం మీద నెలకొని ఉంది. ఐతే ఈ అగ్నిపర్వతానికి ప్రతి 650,000 సంవత్సరాలకొకసారి ఆవులించే ఒక చెడ్డ అలవాటు ఉంది. దాని మూలంగా ఆకాశమంతా బూడిదతో కప్పబడి, సూర్యరశ్మి భూమిపై సోకదు. అప్పుడు భూమి పూర్తిగా చల్లబడి, మంచుఖండంలా మారుతుంది. అది అలా 15,000 సంవత్స్సరాల వరకు కొనసాగుతుంది.
యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడుగన రోజురోజుకీ పీడనం పెరుగుతోంది. అది 2012లో పూర్తిస్థాయిలో ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
_________________________________________________________________________________________________________________

నాసా వారి ప్రకారం ఇది 2012 లో బ్రధ్ధలయ్యే అవకాశం లేదు. ఒకవేళ అలా జరిగినా దానివల్ల ప్రపంచం మొత్తం నాశనమవ్వడం అనేది .


6. ఉత్తర దక్షిణ ధ్రువాలు ప్రతి 750,000 సంవత్సరాల కొకసారి తమ స్థానాలు మార్చుకుంటాయట ! ఇప్పటికే ధ్రువాలు ఏడాదికి 20 - 30 కిలోమీటర్‌లు ఎడంగా జరుగుతున్నాయట ! అలా క్రమేపీ భూమి చుట్టు ఉన్న అయస్కాంత శక్తి నశించిపోయి , అల్ట్రా వయొలెట్ కిరణాలు భూమిపై సోకి, సర్వ ప్రాణులను నశింప జేస్తాయని ఒక కథనం.
________________________________________________________________________________________________________________

ముందుగా - స్థానాలు మారేది అయస్కాంత ధ్రువాలకి, భౌగోళిక ధ్రువాలకి కాదు. అయస్కాంత ధౄవాలు స్థానం మార్చుకోవడం వల్ల తీవ్ర నష్టాలేమి జరగవు. పైగా ఒక ధృవం ఒక డీగ్రీ జరగడానికి కొన్నొ వేల సంవత్సరాలు పడుతుంది.


7. 2012లో ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొనబోతోది. అలా కాని జరిగితే ,అప్పుడు భయంకరమైన భూకంపాలు, సునామీలు సంభవించవచ్చు.
________________________________________________________________________________________

1995 లో నేన్సీ లైడర్ తను వేరే గ్రహాలను సంప్రదిస్తానని, దానిని ప్రకారం 2003 లో ( ఇప్పుడూ 2010 అని మాట మార్చింది అనుకోండి) భూమి అంతమవబోతొంది అంటు, పనిలో పనిగా ఈ ఉల్కోత్పాతం గురించి కూడా చెప్పిన కట్టు కధ ఇది. నాకు తెలిసిన దాని ప్రకారం, 2020 లలో భూమికి దగ్గరగా వచ్చే ఒక తోక చుక్క భూమిని ఢీకొనే ప్రమాదం ఉంది, అయితే ఈ మధ్య విడూదలైన సమాచారం ప్రకారం ఆ అవకాశం అత్యల్పం.



ఇదంతా సరేగానీ, నా బ్లాగులో ఆ మధ్య ఈ మట్ట ఆ మట్టా రహస్యం తెలిసిపోయిందోహో అని చెప్పినవారు మళ్ళీ కనబడడం లేదేమిటి? నేను దానిని చూడకుండానే తీసేశాను. మళ్ళీ చెప్పరూ ప్లీస్?

21, నవంబర్ 2009, శనివారం

కూడలిలో లేని (రాని) సరికొత్త బ్లాగు

http://onlyforpraveen.wordpress.com

ప్రతీ పోస్టుకీ వంద కామెంట్లు రాలుతున్నాయ్ - మొదలు పెట్టింది ఎవరో గానీ పండగ చేసుకుంటున్నారుగా!

అన్నట్టు ఆ మధ్య ఏదో సెన్సేషన్ చేస్తా అంటూ వచ్చిన ఆమట్ట ఈమట్ట ఏ మట్టమీదున్నారో?

15, నవంబర్ 2009, ఆదివారం

2012 - అ హారర్ (కామెడీ?) స్టోరీ!

ఆ తోక కావాలనే తగిలించాలేండి. దయ్యాలు, భూతాలవంటి వాటిని చూపించకుండానే జనాలని భయపెట్టడంలో సిధ్ధహస్తుడైన రోలేండ్ ఏమెరిచ్ ( 'గాడ్జిలా', 'ఇండిపెండెన్స్ డే', '10,000 బీసీ', 'ద డే ఆఫ్టర్ టుమారో' చిత్రాలు గుర్తున్నాయా?) సరికొత్త సృష్టే ఈ 2012 చిత్రం. తినడానికి నిన్న బయటకెళ్ళి అనుకోకుండా చూసిన చిత్రమిది.

కధలోకొస్తే 2012 డిసెంబర్ 21 (12-21-12) నాడు అంతమయ్యే మాయన్ కేలండర్, దాని చూట్టూ అల్లుకున్న "ఎండ్ ఆఫ్ ద వోర్ల్డ్" కధల నేపధ్యంలో తీసిన ఫేంటసీ సినీమా ఇది. ఆ రోజు ప్రపంచం నిజంగా అంతమైపోతుందని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి, కానీ ఆ భయాలకి ఒక చలన చిత్ర రూపమిచ్చి, అద్భుతమైన గ్రేఫిక్స్ తో ప్రేక్షకులని భయపెట్టడం ఏమెరిచ్ కే చెల్లింది. భారతదేశం సంగతి ఇంకా తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఈ సినీమా ఒక చిన్నపాటి సంచలనం సృష్టిస్తోంది.

కధలోకొస్తే - ఒక భారతీయ శాస్త్రజ్ఞుడు భూమి పొరల్లో జరిగే గందరగోళాన్ని కనిపెట్టి, ఏదో పెద్ద విధ్వంసం జరగబోతోందని గ్రహించి, తన మిత్రుడైన ఓ అమేరికన్ శాస్త్రజ్ఞుడికి ఆ విషయం చెప్తడు. ఆ అమేరికన్ వెంటనే ప్రభుత్వానికి ఆ విషయం తెలియచేస్తాడు. ఏం జరగబోతోందా అని విశ్లేషిస్తే అతి త్వరలో భూమండలం సర్వనాశనం కాబోతోందన్న విషయం తెలుస్తుంది. ఇక దానినుండి వీలయినంతమంది ప్రజలని ( ధనవంతులనే అనుకోండి ) కాపాడడానికి ప్రయత్నాలు మొదలవుతాయి - ఎక్కడో టిబెట్ లో, ఒక డేం పేరుతో, ఎవరికీ తెలియకుండా. ఈ లోగా ఒక సామాన్యుడైన రచయిత & డ్రైవర్ కి యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ లో ఒక రేడీయో జాకీ ద్వారా ఈ విషయం తెలుస్తుంది. వెంటనే తననుండి విడిపోయిన తన భార్యా పిల్లలని రక్షించే ప్రయత్నాలు మొదలుపెడతాడు. శాస్త్రవేత్తలు ఊహించిన "ఎపోలొకేలిప్స్" అమేరికాలోనే మొదలవుతుంది. క్షణాలలో కేలిఫోర్నియా లోని "బే ఏరియా" తుడిచిపెట్టుకుపోతుంది - కనీ వినీ ఎరగని భూకంపాలతో. మన రచయిత గారు ఎలాగో కష్టపడి ఒక విమానం సంపాదించి దానిలోకి ఫేమిలీని చేరుస్తాడు - కానీ ఆ లక్కపిడత విమానంలో చైనా చేరేదెలా?

క్రిందనేమో మిలియన్లకొద్దీ ప్రజలు గంట గంటకీ మరణిస్తూ ఉంటారు. ప్రపంచ ప్రభుత్వాధినేతలందరూ చైనా ప్రయాణమవుతారు, తమని తాము రక్షించుకోడానికి - ఒక్క అమేరికా, ఇటలీ నేతలు తప్ప - వారు మాత్రం సామాన్య ప్రజానీకంతో కలిసి ప్రాణత్యాగం చెయ్యడానికే సిధ్ధపడతారు. విధ్వంసం ఏ రకంగా జరుగుతుంది, ఎంత వేగంతో జరుగుతుంది, దానినుండి రక్షంపబడేవారెవరు, చివరికి భూమిపై ఏమి మిగులుతుంది అనేదే తదుపరి కధాంశం.

ఈ సినిమాకి గ్రేఫిక్స్/విషువల్స్ పెద్ద హైలైట్. నాకయితే మాత్రం బాగా నచ్చాయి. ప్రేక్షకులని సీట్లకి అంటిపెట్టుకునేలా చేస్తాయి. సినేమేటొగ్రఫీ కూడా బాగుంది. అయితే ఈ సినిమాకి పెద్ద లోపం: కధలో బలం లేకపోవడం. (అదీగాక "ద నోయింగ్" ( నికొలాస్ కేజ్) చిత్రం కూడ ఇలాంటి కధాంశంతోనే ఈ ఏడాది మొదట్లో విడుదలయ్యింది) కధనం బాగున్నా, కొత్తదనం లేని కధ మూలంగా, ప్రేక్షకులలో తరవాత వచ్చే సన్నివేశంలో గ్రేఫిక్స్ ఎలా ఉంటాయోనన్న ఆసక్తి తప్పితే తరవాత ఏమిజరుగుతుందోనన్న ఉత్కంఠత కనిపించదు. కొంతమందికి ఇదో కామెడి సినిమాలా కూడా అనిపించచ్చు. కొన్ని సన్నివేశాలైతే పాత సినీమాల కాపీలే. ఫలితం ముందే "ఫిక్స్" చేసిన క్రికెట్ మేచ్ చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకులకి ఖచ్చితంగా కలుగుతుంది, అయితే "ఫలితం ఎవడికి కావాలెహే? సెహ్వాగ్, తెండుల్కర్ కొట్టే సిక్సులు చూడడానికొచ్చా" అనేరకం ప్రేక్షకులకి ఈ చిత్రం విపరీతంగా నచ్చేస్తుంది, ముఖ్యంగా చిన్నపిల్లలకి. మీ పిల్లలతో కలిసి హాయిగా సరదాగా చూడాలి అనుకుంటే తప్పకుండా చూడండి, మీకు డబ్బులు గిట్టుబాటే! ఏదో కళాఖండం చూద్దామని వెడితే మాత్రం నిరాశ తప్పదు.

నాకు నవ్వుతెప్పించిన డయలాగ్:


"Do you mean to say that the North Pole has shifted to Wisconsin?"

"Sir! It's actually the South Pole!"


ఈ చిత్రానికి నా రేటింగ్ - ఐదుకి రెండున్నర!




కొసమెరుపు: ఈ సినిమా చూస్తున్న సంగతి మా ఆవిడకి చెప్పిన వెంటనే (ఈ వారం నేను ఆస్టిన్ వెళ్ళలేదు), "నువ్వొచ్చినప్పుడు కలిసి చూద్దామని నేను, నీ కూతురు వెయిట్ చేస్తుంటే నాకు చెప్పకుండా చూసేస్తున్నావా!" అని చిందులెయ్యడం మొదలెట్టింది. విధ్వంసం 2012 వరకూ ఆగకపోవచ్చేమో :))