18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

బులుసు గారూ మీకిది తగునా?

అయ్యా బులుసుగారూ, ఏమనుకోకండీ గానీ మీ బ్లాగును నేను blacklist చేస్తున్నా. నేను ఇక ముందు చదవని బ్లాగుల్లో ఇదొకటి.

ఎందుకంటారా? ఎవడికి చెప్పుకోను నా కష్టాలు?

ఒక రోజు పొద్దున్నే ఎందుకో (ఎందుకేమిటి లెండి .. బుధ్ధిలేక) మీ బ్లాగు చదవటం మొదలుపెట్టాను, అది కూడా మీ పెళ్ళి చూపుల టపా. రెండంటే రెండే నిమిషాల్లో ఒక మైలు దూరంలో కూర్చునేవాడొకడొచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు, అంత గట్టిగా నవ్వద్దంటూ.

సరే మూతికి గుడ్డ చుట్టుకుని మరో రెండు టపాలు చదివా. అది కాస్తా చిరిగిపోయింది. ఈలోగా అరమైలు దూరంలో ఉండేవాళ్ళందరూ పదింటికే లంచికి వెళ్ళిపోయారు (దానికి కారణం నేనేనని ఆ తరవాత తెలిసింది). సరే ఇక నావల్లకాదని అటు ఇటూ తిరగటం మొదలుపెట్టా. అయినా సరే మీ టపాల్లోని విషయాలు గుర్తుకు రాకుండా ఉండవుకదా!

వాక్వే లో నడుస్తూ వెడుతుంటే ఒక దేశీ వనిత జీన్స్ మీద కుర్తా, వాలుజడ, పెద్ద బొట్టూ, మల్లెపూలూ పెట్టుకుని ( మీ ఊహ కరెక్టే, తెలుగమ్మాయే, ఎవరో అన్నట్టు వారికి తప్ప మరెవరికీ ఇలాంటి విచిత్ర వస్త్రధారణ ఉండదుకదా) ఎదురుగుండా వస్తోంది. ఈలోగా మీ బండోపాఖ్యానం గుర్తొచ్చి నవ్వేశా. ఆమేమో తన బట్టలని చూసి నవ్వుతున్నాననుకుని మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయింది. వెంటనే నవ్వు ఆపుకున్నా. ఆ వెనకాలే వచ్చిన తమిళ పొన్నుని (ముదురు ఎరుపు చొక్కా, మెరుపుల జీన్స్) చూస్తే ఎందుకో మీ చివరి క్షణాలు గుర్తొచ్చాయి. కానీ నవ్వితే ఇబ్బంది అని నవ్వలేక, ఆపుకోలేక అదోటైపులో మొహం పెట్టా. ఆ పిల్లేమో "ఛి! నలభై యేళ్ళొచ్చి, ఒక కూతురు కూడా ఉండీ అవేం చూపులూ?" అనే టైపులో ఒక లుక్కిచ్చి ( ఏమిటో లేండి, ప్రపంచంలో జనాలందరూ వీళ్ళవెంటే పడతారని వీళ్ళకి కాస్త అనుమానం) వెళ్ళిపోయింది.

మరికాస్త ముందుకెడితే ఒక నీలమేఘశ్యాముడు - బోడి గుండు, బుఱ్ఱ మీసం - మన అంగ్రేజ్ సినిమాలో అన్నకి రంగుపూసినట్టన్నమాట - మీ సినిమా కథ గుర్తొచ్చింది - ఇక నావల్లకాదనుకుని పెద్దగా నవ్వేశా. వాడప్పుడే ఎవరితోనో తిట్లు తినొస్తున్నాట్ట, కోపంగా చూసుకుంటూ వెళ్లి పోయాడు. తరవాత వచ్చిన ఒక శ్వేతసుందరి మాత్రం "ఎప్పుడూ కనీసం పలకరింపుగా కూడా నవ్వనివాడు ఇవాళ ఇలా నవ్వుతున్నాడేమిటబ్బా?" అనుకుని, ఆనందపడిపోయి ఒక హగ్గు ఇచ్చి మరీ వెళ్ళింది. ఇది చూసి పైన చెప్పిన తమిళ తెలుగు పోర్లు మహిళా విశ్లేషణ -అదేనండీ గుస గుస గుస గుస - మొదలుపెట్టారు. ఇలా హగ్గులని అపార్థం చేసుకునే వాళ్ళు మా ఆవిడకి ఈ విషయం చేరేస్తే నా గతేంగాను?

ఇకమీటింగులో, ఎవరో ఒక అయిడియా చెప్పి ఎలా ఉంది అని నన్నడిగారు. ఖర్మకాలి అప్పుడే 239 వ దినం గుర్తొచ్చింది. ఇక ఆపకుండా నవ్వటం మొదలుపెట్టా. ఆ తరవాత ఒక మంచి అయిడియాని అపహాస్యం చేస్తావా అని తిట్లు పడటమే కాకుండా ఒక warning కూడా వచ్చింది గట్టిగా నవ్వద్దని.

అందుకే దీనంతటికీ కారణమయిన బులుసుగారి పులుసును, అదే నవ్వితేనవ్వండి బ్లాగును నేను బహిష్కరిస్తున్నా.

13 కామెంట్‌లు:

  1. అయితే మీకింకా ఆయన ఆత్మహత్యాప్రయత్నం గురించి తెలియదన్నమాట.

    రిప్లయితొలగించండి
  2. ఇన్ని రోజల నుంచి ఈ బ్లాగును ఎలా ఫాలో కాలేదబ్బా ... కేక బ్లాగు
    ఆ బలుసు గారి మీద పోలిస్ కంప్లేయిట్ ఇద్దాం నవ్వులతో జనాలని ఇబ్బంది పేడుతున్నారని :)

    రిప్లయితొలగించండి
  3. బ్లాగులు చదివితే భామల హగ్గులు దొరుకుతున్నాయా!!
    బావుందే, ఇన్ని రోజులు చెప్పలేదేం బాస్. సెల్ఫిష్.

    నేనిప్పుడే మొదలెడుతున్నా, ఎక్కడ ఆ బ్లాగు. వచ్చేస్తున్నా.

    రిప్లయితొలగించండి
  4. ఐతే చాలా మిస్సయ్యావు పవను.....నీ కేక చూస్తుంటే కొన్ని పోస్టులు చదివినట్టున్నావ్? మొత్తం చదివితే మలక్‌గారి లాగే నువ్వూ పోస్టు పెడతావేమో

    రిప్లయితొలగించండి
  5. మెజారిటీ బ్లాగర్లందరి బాధా ఇదే అనుకుంటా (ప్చ్ పాపం బులుసు గారు)

    రిప్లయితొలగించండి
  6. బాగోలేదు అని చెప్పట్లేదు.. మొదటి 10 15 పోస్టులతో పోలిస్తే ఇప్పుడు నిజంగా చాలా బాగా రాస్తున్నారు.... కానీ నా ఆల్ టైం ఫేవరెట్స్ రెండు రెళ్ళు ఆరు మరియు జాజిపూలు లతో పోల్చేంత లేదు...

    రిప్లయితొలగించండి
  7. ఒక్క ముక్కలో చెప్పాలంటే... కఠోర షటఖర్మపరాయుణులనూ కదిలించి, 'లేచిపోదామా' అని ఆలోచింపజేసే బ్లాగు బులుసు గారిది అంటే అతిశయోక్తి కాదు. :)) :P

    రిప్లయితొలగించండి
  8. Agnata,

    Can't compare Bulusu's blog with Jaajipoolu. Bulusu's posts far above anything. I don't mean to degrade Jaajipoolu blog.

    రిప్లయితొలగించండి
  9. Kishore,

    Did you ever had a look at rendu rellu aaru??

    రిప్లయితొలగించండి
  10. I meant to say far above XYZ blog. As I don't want to hurt anybody posted as above. I like Rendu rellu aaru. But I felt his latest post is not upto his mark.

    I like the blog by Mr. Aswin too.

    kishore

    రిప్లయితొలగించండి