10, సెప్టెంబర్ 2013, మంగళవారం

తెలుగువాడి ఆత్మగౌరవం Vs. తెలంగాణా ఆత్మ గౌరవం

--- A repost... original dated back to 2010 .. but still relevant  ...









ఈ మధ్య కాలంలో నేను విన్న అతి పెద్ద అబధ్ధం - "మా పోరాటం హైదరాబాద్ కోసం కాదు!" .. ఇది రెండు పార్టీలూ చెప్తున్న మాటే .. "తెలుగువాడి ఆత్మగౌరవం", "తెలంగాణా ఆత్మ గౌరవం" ముసుగేసుకుని ...

ఒకవేళ సమైక్య వాదులకి హైదరాబాద్ అక్కరలేకపోతే ఉద్యమమంతా హైదరబాద్ మీదే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఒక్కరైనా "జరిగిందేదో జరిగింది... ఇప్పుడయినా తెలంగాణాకి జరిగిన అన్యాయానికి ప్రాయశ్చితం చేద్దాం" అన్నారా? అబ్బే!! ఎందుకంటారూ? "మిగిలినవాళ్ళు ఎటుపోతే మాకేం? మా హైదరాబాద్ మాకొస్తే చాలు" - అంతేనా?

ఇక వేర్పాటువాదుల సంగతి - నిజంగానే తెలంగాణా కావాల్సినవారైతే "సరే, ఉన్న చిక్కంతా హైదరాబాదే కదా. దానిని కొన్నాళ్ళు విడిగా పెడదాం - మిగిలిన జిల్లాలని కలిపి వెంటనే తెలంగాణా ఇవ్వండి - హైదరాబాద్ తేలేదాకా విడిగా పెడదాం" అనుండే వారు, సమైక్యవాదులు అందరూకాకపోయినా చాలామంది ఒప్పేసుకునేవారు - కానీ అలా అన్నారా? లేదే! "హైదరాబాద్ లేని తెలంగాణా మాకొద్దు" అనడంలోనే తెలుస్తోంది తెలంగాణామీద ఎంత ప్రేముందో. మిగిలిన జిల్లాలు జిల్లాలు కావా? వాటిట్లో మనుషులు ఉండరా? అదీ కాక మహరాష్ట్రకీ, కర్నాటక కి జిల్లాలని మొత్తం వదులుకోలేదా? ఇది అంతకన్నా ఘోరమేమీ కాదే?




స్వగతం: రెండు గుంపులనీ కెలికి రాళ్ళేసా ... ఇద్దరూ కలిపి వాయిస్తారేమో? Let them :P

5, జులై 2013, శుక్రవారం

"ఊర్వశీ ఊర్వశీ" ట్యూన్లో వోటర్లపైన ఒక "ప్రేమికుడి" ఆక్రోశం :P





వోటరూ, వోటరూ టేకీటీసీ వోటరూ
నేతలు నిన్ను ఫూలు చేస్తే లైటుతీస్కో వోటరూ
నిన్ను వెధవని చెయ్యటమంటే వాళ్ళకి సింపుల్ మేటరూ .. 
నాయకుల..పే..కాటలోన నువ్వే అసలు జోకరూ ...

వోటరూ, వోటరూ టేకీటీసీ వోటరూ...

నీకసలు తెలుసా తెలుసా ఎమ్మెల్యే ఎంపీ నీవాళ్ళే
నువ్వు వోటింగ్ ఎగ్గొడితే మిగిలిన వోట్లతో గెలిచినాళ్ళే
అయినా నీకూ కావల్సింది టీవీలో హేరీ పాటరూ ..
దొంగవోట్లు ఎన్నిపడినా నువ్వు చెయ్యి బేఖాతరూ..

వోటరూ, వోటరూ టేకీటీసీ వోటరూ...

స్టేటునే విడగొడతామంటే ఈసీ కోస్తా వోటరూ
ఇప్పుడప్పుడే తేల్చము అంటే ఈసీ తెలంగాణా వోటరూ
నీది త్రిశంకు స్వర్గం అంటే ఈసీ రాయలసీమ వోటరూ
నెత్తిపై శఠగోపం పెడితే ఈసీ ఆంధ్రప్రదేశ్వోటరూ ...

వోటరూ, వోటరూ టేకీటీసీ వోటరూ...

కేడర్లు గుడినే మింగేస్తే... లీడర్లు లింగం మింగునులే
అందులో నీక్కాస్త పడవేస్తే... నీ మెదడు వైట్-వాష్ అవ్వునులే
నువ్వు ఇక బక్రా అయిపోతే... నీకసలు ఫికరే అక్కరలే
ఏదో ఒక ఫ్రీ స్కీమే పెడితే...  నీ కుక్క తోకే వంకరలే 

వోటుకింతని రొఖ్ఖం ఇస్తే పండగ చేస్కో వోటరూ
ఫుల్లుగా మందేపోయిస్తే ఎంజాయ్ చెయ్యి వోటరూ
గెలిచినాక టాటా చెబితే ఏడ్చుకో ఇక వోటరూ
అయిదేళ్ళయ్యాక కనిపిస్తే అంతా మర్చిపో వోటరూ

వోటరూ, వోటరూ టేకీటీసీ వోటరూ...

నువ్వు నేతలపై అలిగేస్తే... వెంటనే క్రికెట్ మేచ్ ఖాయం
దానిలో ఇండియా గెలిచేస్తే... నీకున్న కోపం మటుమాయం..
నీవల్ల గెలిచిన వారైతే నీకసలు చెయ్యరుగా సాయం
అసలు కారకుడివి నువ్వేగా.. నీకింక తప్పదు ఈ న్యాయం!

3, జులై 2013, బుధవారం

శంకరశాస్త్రి టిఫిన్!




 ఒక రోజు శంకరశాస్త్రిగారో టిఫిన్ సెంటర్కి వెళ్ళారు. ఆయన చెప్పినదాన్ని సెర్వర్ ఒక పట్టాన తీసుకురాకపోయేసరికి కాస్త దీనంగా, కాస్త కోపంగా "శంకరా! నాదశరీరాపరా" ట్యూనులో ఈ పేరడీ ఎత్తుకున్నారు.

 పల్లవి:
 సెర్వరా! నాన్చుడు ఇక ఆపరా..
వేగముగా సాగరా
టిఫిన్ తీసుకురా...!

 సెర్వరా!
నాన్చుడు ఇక ఆపరా..
వేగముగా సాగరా
టిఫిన్ తీసుకురా...!

 చరణం 1:

 గారెలు ఎఱుపని, ఆవడ తెలుపని
మూకుడే నలుపుయనీ ...
నిన్నటి పుల్లని పెఱుగును కలిపితే
 గారెనే ఆవడనీ ..

 గారెలు ఎఱుపని, ఆవడ తెలుపని
మూకుడే నలుపుయనీ ...
 నిన్నటి పుల్లని పెఱుగును కలిపితే
 గారెనే ఆవడనీ ..

పాకపు కిటుకులు తెలిసినవాడవు మరోనలుడవు నీవైతే ... 
పాకపు కిటుకులు తెలిసినవాడవు మరోనలుడవు నీవైతే ...

 ఇడ్లీ పూరి బిసిబెళేబాత్ ఉప్మా 
మఱువరా నీవు మఱువరా
కుక్కులెరుగనీ కొత్తవంటకం
స్వయంశక్తితో చేసిపెట్టరా .. వేసిపెట్టరా...

 సెర్వరా!
 నాన్చుడు ఇక ఆపరా..
వేగముగా సాగరా
టిఫిన్ తీసుకురా...!

 చరణం 2:

 ఉడికే కుడుములు అతివకు గుచ్చిన మన్మథ చూపులు కాబోలూ ..
వేగే పుణుకులు నరకపు యమునికి చిక్కిన పాపులు కాబోలూ ..

 పెనం మీదపడవేయంగా .. చఱ్ఱున కాలెనుగదా వంగా...
 పెనం మీద పడవేయంగా .. చఱ్ఱున కాలెనుగదా వంగా...

 సాంబారే దానితో చేయంగా ... ఆ తలపుకే నానోరూరంగా ...

 ఆ ..ఆ .. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

 సెర్వరా! నాన్చుడు ఇక ఆపరా.. వేగముగా సాగరా టిఫిన్ తీసుకురా...! సెర్వరా! సెర్వరా!! సెర్వరా!!!

30, మార్చి 2013, శనివారం

శ్రీ శాకంబరీ అంతర్జాల అష్టావధానం (మాలిక పత్రిక సౌజన్యంతో)




మాలిక పత్రిక  తరఫున  రేపు సాయంత్రం భారతీయ కాలమానం ప్రకారం  6 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు రెండవ అంతర్జాల అష్టావధానం నిర్వహించబడుతుంది. ఇదే శ్రీ శాకంబరీ అంతర్జాల అష్టావధానం. ఈసారి అవధాన కార్యక్రమం మొత్తం ఆహారానికి సంబంధించినదై ఉంటుంది. చూడాలి మరి ఎంత రసవత్తరంగా సాగుతుందో....  ఈ అవధానం మొత్తం లేఖనా రూపంలో జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా శ్రీ శాకంబరీ పేరిట ఒక గ్రూపు ప్రారంభించబడి అందులోనే  చర్చలు జరుపుకుంటూ కార్యక్రమాన్ని ఒక తుది రూపానికి తీసుకురావడం జరిగింది. అందులో అవధానిగారు,  పృచ్ఛకులు, మాలిక ప్రతినిధులు పాల్గొని అవధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు..


ఈ అవధాన కార్యక్రమంలోని ముఖ్య అంశాలు, పృచ్ఛకుల వివరాలు:


మొదట నిర్వాహకుల స్వాగత వచనాలు.

తరువాత అవధాని గారి స్వపరిచయం, వరుసగా పృచ్ఛకుల స్వపరిచయం, అతిథుల స్వపరిచయం...

అవధాన ప్రారంభం

అవధానిగారి చేత దైవ ప్రార్థన, స్వవిషయం, (అవసరమనుకుంటే) అవధాన ప్రక్రియా పరిచయం, ప్రాశస్త్యాలు పద్యాలలో...

నాలుగు ఆవృత్తుల వరుసక్రమం ఇలా  ఉంటుంది.



1. నిషిద్ధాక్షరి :                   

2. నిషిద్ధాక్షరి : 

3. దత్తపది   : 

4. దత్తపది 

5. సమస్య  :

6. సమస్య  :

7. వర్ణన    :  

8.అప్రస్తుత ప్రసంగం :    
 

అప్రస్తుత ప్రసంగం నిర్వహించే పృచ్ఛకులకు ఎప్పుడైనా మాట్లాడే, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. నిరంకుశులు కదా!


చివర అవధాని గారు, నిర్వాహకుడు ధన్యవాదాలు తెలుపడంతో అష్టావధాన కార్యక్రమం ముగుస్తుంది.


అష్టావధాని :  డా . మాడుగుల అనిల్ కుమార్ గారు, ఎం .ఎ ; బి.ఎడ్ ;  పీహెచ్ .డి.
(సంస్కృతోపన్యాసకులు , శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల , తిరుపతి)


అధ్యక్షులు మఱియు సంచాలకులు : శ్రీ చింతా రామ కృష్ణారావుగారు,  భాషా ప్రవీణ , ఎం .ఎ

 పృచ్ఛకులు :


1. నిషిద్ధాక్షరి :  శ్రీ చింతా రామ కృష్ణారావు గారు 
               

2. నిషిద్ధాక్షరి :  శ్రీ ముక్కు రాఘవ కిరణ్ గారు

 
3. దత్తపది   :  శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారు


4. దత్తపది  డా . శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ గారు

 
5. సమస్య  : శ్రీ యం.నాగగురునాథశర్మగారు


6. సమస్య  : శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు


7. వర్ణన    :   శ్రీమతి వలబోజు జ్యోతిగారు


8.అప్రస్తుత ప్రసంగం :     శ్రీ నల్లాన్ చక్రవర్తుల కిరణ్ గారు

మరో ముఖ్యమైన విషయం: ఈ అవధాన కార్యక్రమాన్ని ఆస్వాదించి, ఆనందించాలనుకునే వారికోసం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అది మాలిక  పత్రికలో రేపు సాయంత్రం ఆరునుండి మొదలవుతుంది. తప్పుకుండా చూడండి మరి..  ప్రతీ ఐదు నిమిషాలకోసారి ఈ పేజిన్ Refresh / Reload చేస్తుండాలి. ఈ ప్రత్యక్షప్రసార బాధ్యతలు నిర్వహిస్తున్నది భరద్వాజ్ వెలమకన్ని..

 

మాలిక పత్రిక : http://magazine.maalika.org

27, మార్చి 2013, బుధవారం

శ్రీ శాకంబరి అంతర్జాల అవధానం (మాలిక పత్రిక )

 
 
 
శ్రీ శాకంబరి అంతర్జాల అవధానం

31st  March 2013 సాయంత్రం ఆరుగంటలనుండి రాత్రి తొమ్మిదివరకు

పూర్తి వివరాలు ఎల్లుండి విడుదల చేయబడతాయి...


గతంలో విజయదశమి సంధర్భంగా మాలిక పత్రిక నిర్వహించిన మొదటి అంతర్జాల అవధానం మిక్కిలి ప్రశంసలు  పొందింది. ఈ ఉత్సాహముతో విజయనామ నూతన సంవత్సరాది సందర్భంగా మరోమారు ఈ అంతర్జాల అవధాన ప్రయోగాన్ని చేయ తలపెట్టింది. కాని ఈసారి కాస్త ప్రత్యేకత ఉంది. ఈసారి అవధాన కార్యక్రమంలో మొత్తం అందరికీ ఇష్టమైన ఆహారం గురించి మాత్రమే ప్రస్తావన ఉంటుంది. అందుకే శ్రీ శాకంబరి అంతర్జాల అవధానం అని నామకరణం చేయబడింది. ముందుగా ఈ శాకంబరి దేవిని స్మరించుకుందాం..


 అడగకుండానే ఆకలి తీర్చేది అమ్మ.  తనకు కష్టమని తలంచకుండా ఎవరికి ఇష్టమైన రీతిగా వాళ్లకు చేసిపెట్టేది తల్లి.

శాకంబరిదేవి మనిషి ఆకలిని తీర్చడానికి ఉద్భవించిన తల్లి. క్షామం నుంచి విముక్తం చేయడానికి ఎప్పుడూ ఆకలి దరి చేరకుండా ఉండడానికి భక్తులు శాకంబరి దేవిని పూజిస్తారు. అమ్మవారి ఉత్సవాలలో వివిధరకముల శాకములు (కూరగాయలతో అలంకరించి పూజలు చేస్తారు) శాకంబరి నీలవర్ణ దేహంతో సుందరంగా ఉంటుంది. కమలాసనంపై కూర్చుండి, పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకుని, మిగతా చేతులలో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు తదితర కూరగాయలు ధరించి ఉంటుంది.

శాకంబరి ఎవరు?

దేవీ భాగవతంతో పాటు మార్కండేయ పురాణాంతర్గత చండీసప్తశతిలో శాకంబరి గురించి వివరించబడి ఉంది. హిరణ్యాక్షుని వంశంవాడైన దుర్గముడనే రాక్షసుని అకృత్యాల వల్ల దేవతల శక్తి క్షీణించి, ప్రకృతి వైపరీత్యం ఏర్పడి, నీటి చుక్క లేకుండా నూరు సంవత్సరాలపాటు క్షామ పరిస్థితులు ఏర్పడి, ప్రాణకోటి ఆపదలో ఉన్న సమయంలో భూమి మీద ఉన్న మునీశ్వరులు జగన్మాతను ప్రార్థించగా... ‘‘నేను అయోనిజగా అవతరించి, నూరు కన్నులతో చూస్తూ, మునులను లోకాలను కాపాడతాను. ఆ తర్వాత నా దేహం నుంచి శాకములను పుట్టించి ప్రజల ఆకలి తీరుస్తూ మళ్లీ వర్షాలు కురిసేంత వరకు ప్రాణికోటిని, జనులను కాపాడతాను’’ అని వరమిచ్చి, ఆవిధంగానే అవతరించి, ప్రాణకోటిని రక్షించి, శాకంబరీదేవిగా పూజలందుకుంది.  

 

 అసలు అవధానం అంటే ఏమిటి? వివరాలు తెలుసుకోవాలంటే:




ఇంతకు ముంధు మాలిక పత్రిక నిర్వహించిన వాణి - మనోహరి అంతర్జాల అవధానం వివరాలు

వాణి - మనోహరి