14, జూన్ 2011, మంగళవారం

భక్తి

1990ల సంగతి ...

మా అమ్మ బయటకేదో పనిమీద వెళ్ళి పనిలో పనిగా పుస్తకాల షాపుకి వెళ్ళారు. అవీ ఇవీ చూస్తూ ఆవిడ పని చేసిన కళాశాలలో ఇద్దరు కలీగ్స్ మాట్లాడుకుంటుండగా ప్రస్తావనకి వచ్చిన పుస్తకాన్ని కొన్నారు. ఆ షాప్ ఓనర్ కాస్త తటపటాయించాడు అమ్మడానికి - ముందు ఒకటే కాపీ ఉందనీ, తరవాత ఎవరో రిజర్వ్ చేసుకున్నారని. కానీ ఆవిడ మిగిలిన కాపీలని కూడా చూపించడంతో చేసేదేమిలేక అమ్మేశాడు.

ఆ మర్నాడు ఆవిడ పూజ చేసుకుంటూండగా మామూలుగా వినిపించే స్తోత్రాలకు బదులు నాకు తిట్లు వినిపించాయి. "అడ్డగాడిదలు, దరిద్రపుగొట్టు వెధవలు, అన్నం తినే మనుషులా గడ్డి తినే పశువులా?" నాకొక నిముషం అర్థం కాలేదు ఏం జరుగుతోందో. తిట్లతో పూజలు చెయ్యటం కొత్త పధ్ధతేమో అని సరిపెట్టుకున్నా. కానీ కాసేపయ్యాక మరీ దేవుడిని అలా తిడుతోందేమిటి అని అనుమానం వచ్చి పూజగదిలోకి తొంగి చూశా.

అమ్మ మొహం కోపంగా, భీకరంగా ఉంది. ఏమైందని అడిగా.

"చూడరా నా కలీగ్ దరిద్రులు, ఏదో భక్తి పుస్తకమంటే షాపు ఓనర్ ఇవ్వనంటున్నా మరీ కొని పట్టుకొచ్చా ఈ పుస్తకాన్ని. పూజ టైంలో చదువుకుందామని తెరిచి చూస్తే ఏముందీ? దరిద్రులు, దరిద్రులు" అని మళ్ళీ తిట్లు లంకించుకుంది.

భక్తి పుస్తకంలో అంత భయంకరమైనది ఏముంటుందా అనుకుంటూ ఆ పుస్తకాన్ని చూసాక నాకు నవ్వాగలేదు. అదంతా అ ఇద్దరు మగ కలీగ్స్ వాళ్ళలో వాళ్ళు వాడుకునే "భక్తి" అనే కోడ్ వర్డ్ అమ్మకి అర్థం కాకపోవటంవల్ల వచ్చిన గొడవని నాకర్థమైంది. లోపలి పేజీలు చూడకుండా పుస్తకాలని కొనద్దని అప్పటికీ ఆవిడకి చాలాసార్లు చెప్పాను. నా మాట వింటేగా?


ఇంతకీ ఆవిడని అంత ఆగ్రహానికి గురిచేసిన పుస్తకం ఏమిటో తెలుసా?

"కవి చౌడప్ప శతకం" :)))))))))))))))


PS: ఒరిజినల్ కవి చౌడప్ప శతకం వేరు. అవి చాటు పద్యాలు. కానీ ఇక్కడ ఈవిడ కొన్న పుస్తకం, చౌడప్ప పేరడీలది - ఘాటైన భాషతో :)

3 కామెంట్‌లు: