10, ఫిబ్రవరి 2009, మంగళవారం

సమస్యాపురణము

మూడు సమస్యలున్నాయండీ - క్రింద ఇస్తున్నా!

౧. రాజా పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై ...

౨. హరుడు నియంతయౌ హరిని యంతము సేయుట పాడియే కదా ...

౩. భర్త అల్లుడయ్యె భామకపుడు ..

8 కామెంట్‌లు:

  1. రాజా, పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై,
    రోజాలున్నవి వాడి ముళ్ళుయును వీరోచిత్తము న్వీడియున్,
    రేజాలన్నదికన్ శశి ప్రణయము రేపంచున్. హన్న! మా
    యాజాలంబది గన్న విర్సె గనులున్ యాశ్చర్యమున్చేటలై.


    రాజసూయమునకు విచ్చేసిన రారాజుకు విడిదియైన మాయ సభా ప్రాశస్త్యము చెపుతూ పరిచారికుడు చేసిన వర్ణన పద్యాంశము.





    మూడో పాదము అంతగా అతికినట్టుగా లేదు...చూస్తాను మరింకోటి రాయగలనేమో

    రిప్లయితొలగించండి
  2. సమస్య : భర్త అల్లుడయ్యె భామ కపుడు
    డా.ఆచార్య ఫణీంద్ర పూరణం:

    భువికి మరియు సిరికి ధవుడు శ్రీనాథుండు!
    రాముడాడె పెండ్లి భూమి సుతను -
    ఏమి చిత్ర మిద్ది - రామావతారాన
    భర్త అల్లుడయ్యె భామ కపుడు!

    రిప్లయితొలగించండి
  3. చక్రవర్తి గారూ & ఆచార్య ఫణీంద్ర గారూ,

    చాలా బాగున్నాయండీ. నావి (అంటే మా అమ్మగారి పూరణలు) క్రింద ఇస్తున్నా

    --------------------------------

    1. జాజుల్మల్లెల సోయగాలు కళలై జాణల్ సమాయత్తలై
    మైజాఱుల్ సరిచేసి నీటమునుగన్ మాధుర్యముల్ మీరగా
    రాజీవానన మోర్పు చంద్రుడగుచున్ రమ్యమ్ముగా పల్కెనో
    రాజా పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై

    3. సూకరమై నాడు సుదతి బ్రోచిన హరి
    చెట్టబట్టి పృధ్వి చేయిబట్టె
    దాశరధిగ భరణి తనయను పెండ్లాడ
    భర్త అల్లుడయ్యె భామకపుడు

    రిప్లయితొలగించండి
  4. ’మలక్ పేట్ ...’ గారూ!
    మీ అమ్మ గారు మంచి కవయిత్రి. ఆమెకు నా నమోవాకాలు.
    రెండో పద్యం మీరు మీ అమ్మ గారి నుండి సరిగా వ్రాసుకోలేదనుకొంటా.
    ’సూకరమై’ బదులు ’సూకరమయి’ అని ఉండాలి. మూడో పాదంలో ’భరణి’ బదులు ’ధరణి’ అని ఉండాలి. సరి చేయండి.
    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  5. I'm sorry again. It was a typo from my side. Thanks for the correction Acharya Phaneendra garu

    రిప్లయితొలగించండి
  6. సమస్య - రాజా పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై.
    శా|| రాజిల్లంగ తనూవిలాసము కడున్ రమ్యంబులై యొప్పు నం
    భోజాక్షంబులతో శకుంతలయు నా భూజాని దుష్యంతుఁ డ
    వ్యాజేచ్చం గనుచుండ స్నాన మొనరింపన్ జేటి చెప్పెన్ "మహా
    రాజా! పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై"

    సమస్య - హరుఁడు నియంతయౌ హరిని యంతము సేయుట పాడియే కదా.
    చ|| స్థిరముగ వెండికొండను వసించు నెవండు? స్వతంత్ర భావ బం
    ధురుఁడగు భూపుఁ డేమగును? తుంబుర నారదు లెవ్వనిన్ నుతిం
    తురు? దశకంఠు దౌష్ట్యమును ద్రుంచిన రాముని చర్య యెట్టిదో?
    హరుఁడు, నియంతయౌ, హరిని, యంతము సేయుట పాడియే కదా.

    సమస్య - భర్త యల్లుఁడయ్యె భామ కపుడు.
    ఆ.వె|| రాక్షసాధముఁడు హిరణ్యాక్షుఁ జంపుచో
    నవనికి పతి యయ్యె నా ముకుందుఁ
    డతఁడె రాముఁడయ్యు నవనిజఁ జేపట్ట
    భర్త యల్లుఁ డయ్యె భామ కపుడు.

    రిప్లయితొలగించండి
  7. ఆహా! ఒకరిని మించి ఒకరు ... చాలా బాగున్నాయి శంకరయ్య గారూ!

    రిప్లయితొలగించండి
  8. అయ్యా మలక్ పేట్ రౌడీ గారూ, కొత్త సమస్యలను బ్లాగులో పెట్టలేదెందుకు? తొందరగా పెట్టండి.

    రిప్లయితొలగించండి