25, ఫిబ్రవరి 2010, గురువారం

బాబోయ్ టెర్రరిస్టు!!!

(ఇదివరకూ తెలుగుపీపుల్ సైట్లొ వ్రాసిందే ఇది)

చికాగోలో మా పాత కంపెనీలో ఒక కలీగ్ ఉండేవాడు, విజయ్ సింగ్ అని - ఉత్తరభారతీయుడు. వెళ్ళక వెళ్ళక చాలాకాలానికి ఇండియా వెళ్ళాడు. తన ఊళ్ళో కొన్నాళ్ళుండి దేశాటనకి బయల్దేరాడు. పనిలో పనిగా హైదరాబాద్ కూడా వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్టూ ఊరుకోవచ్చుకదా, ఊహూ( నేను హైదరాబాదులో ఉన్నానోచ్ అని ఇక్కడ చిచాగో మిత్రులకి మెయిల్ కొట్టాడు. తన జీవితంలో మరిచిపోలేని ఒక తప్పు అది. ఎందుకో తెలుసుకదా, హైదరాబాద్ అనగానే ఇక్కడ చికాగో వాళ్ళు అక్కడ అమ్మానాన్నలకి ఫోన్లు చెయ్యడం, వాళ్ళూ పొడులు పచ్చళ్ళూ ఇచ్చెయ్యడం జరిగిపోయాయి. "చచ్చాన్రా దేవుడా" అనుకుంటూ అవన్నీ తీసుకుని చికాగో బయల్దేరాడు.

ప్రయాణం బాగానే సాగింది. దిగాక ఇమ్మిగ్రేషన్ అయ్యింది. కస్టంస్ చెక్ లో మనవాడీ మీదకి ఒక కుక్కని వదిలేశారు. అదసలే కుక్క, కష్టాల్లో, అదే కస్టంస్ లో ఉంది, కెలకడానికి ఇండియన్ దొరికాడు, ఇంకెం? రెచ్చిపోయి వాసన చూసేసి నోతికి అందినదేదో బయటకి లాగింది. వెంటనే ఒక మామ వచ్చి ఆ బేగ్ విప్పి చూపించమన్నాడు. మనవాడు కొంచం భయస్తుడు లేండి. దానికి తోడు విపరీతమైన ఖంగారు. వణుకుతూ బేగ్ ఓపెన్ చేసి అన్నీ చూపిస్తుంటే మామకి ఒక పొట్లం కనిపించింది. బయటకి తీశాడు. ఇక వాళ్ళీద్దరి మధ్యా జరిగిన సంభాషణ

Customs Officer: "Sir, where are you coming from?"

Vijay Singh: "Mumbai, India"

Officer: "Could you tell me what's inside this?"

Vijay: "Yeah, its Gun Powder"

Officer: "Whaaat?"

Vijay: "Yes it's Gun Powder from India"


దెబ్బకి మామ కూడా భయపడి మరో ఇద్దరిని పిలిచాడు. "వీడెవడో గన్ పౌడర్ తెచ్చిందే కాకుండా, తెచ్చాను అని ధైర్యంగా చెప్తున్నాడు రోయ్. ఖచ్చితంగా టెర్రరిస్టే" అనుకుంటు మరో ఇద్దరు, పిలవకపోయినా పరిగెత్తుకొచ్చారు. మనవాడీ భయం ఎక్కువయ్యింది. మామలకి ఇంకా అనుమానం వచ్చింది. ఇంటరాగేషన్ మొదలు పెట్టారు

Officer: "Are you sure this is Gun Powder?"

Vijay: "Yes"


చూస్తూంటే, భారతీయుడు, ఏ సూడాన్ వాడొ, అఫ్గాన్ వాడో కాదు. గన్ పౌడర్ తెచ్చాననంటున్నాడు!


Officer: "Do you know it's illegal to bring Gunpowder on the plane?"

Vijay: "NO, I dont"

Officer: "Yes it is. Would you like to tell us what you intend to do with this?"

Vijay: "We Eat it!"

Officer" "You what?"

Vijay: "We Eat it!"

Officer: How can you EAT Gun Powder man? Are you crazy?"

Vijay: "We dont eat it as it is. We can not. But we eat it with Rice. It tastes good!"

Officer: ???!!!???!!!???

హైదరాబాదులో మనవాడికి ఎవరో కందిపొడి ఇచ్చి, తెలుగు రానివాడికి ఆ పేరు అర్ధంకాదని "గన్ పౌడర్" అని చెప్పార్ట (కంది పొడిని మనం ఆంధ్రాలో గన్ పౌడర్ అనేగా పిలిచేది!). పాపం అదే మనవాడి కొంపముంచింది. "గన్ పౌడర్ అంటున్నాడు, తింటాను అంటున్నాడు, వీడు టెర్రరిస్టా, లేక పిచ్చివాడా?" అని అనుమానం వచ్చింది మామలకి.

Officer: Bringing explosives into the country is a serious offense.

మనవాడి బల్బ్ వెలిగింది.

Vijay: "Nooooooo, it's not that Gunpowder that you are imagining it to be. This is made of Indian Spices - Lenthil Powder - a Food Item from South India! We call it gun powder because its very spicy!!"


అప్పుడు పరిస్థితి అర్ధం అయ్యింది మామలకి. దానిని టెస్టు చేసి, ఎందుకైనా మంచిదని చెత్తబుట్టలో పడేసి, నవ్వుకుంటూ మనవాడిని వదిలేశారు.

కనుక సోదరసోదరీమణుల్లారా, అమ్మలారా, అయ్యలారా, మీరెవరికైనా కందిపొడి ఇస్తే, లెంథిల్ పౌడర్ అని చెప్పండిగానీ, గన్ పౌడర్ అని మాత్రం చెప్పకండి :))

12 కామెంట్‌లు:

  1. చదవడానికి మనకు సరదాగానే ఉంది. పాపం సీన్లో ఆయన పరిస్థితి, సగం సీన్ నుంచి పోలీసుల పరిస్థితి తల్చుకుని జాలి అనిపిస్తుంది.
    అనంతపురం ప్రాంతంలో వేరుశెనగ పొడిని గన్ పౌడర్ అంటారు. మా వైపు కంది పొడి తక్కువ.

    రిప్లయితొలగించండి
  2. :-) మా భోస్టన్ వైపు నల్ల కారాన్ని (చింతపండూ, ఎండూమిరపకాయలు కలిపి చేస్తారు) గన్ పౌడర్ అంటారు కిట్టనోళ్ళు.

    రిప్లయితొలగించండి
  3. అవునుకానీ, దీనికి గన్ పౌడర్ అని ఎవరు పేరు పెట్టారో చెప్పండి బాబూ!కారప్పొడికీ ఇదేపేరు, కందిపొడికీ ఇదేపేరు..! గన్ పౌడర్ విషయం తెలీక నేను కూడా ఒకటి రెండు చోట్ల ఫూలయ్యా!

    రిప్లయితొలగించండి
  4. నేను తినే ఏ పొడినైనా గన్ పౌడర్ అనే వాళ్ళు మా హాస్టల్ ఫ్రెండ్స్.. నేను అసలు సిసలైన రాయలసీమ బిడ్డని లెండి.. కారంగా పొడో పచ్చడో లేకుంటే ముద్ద దిగదు..

    రిప్లయితొలగించండి
  5. హ్మ్మ్, కంది పౌడర్ ని, గన్ పౌడర్ అంటారా? ఎప్పుడూ వినలా..అయినా అతిశయోక్తి కాపోతే, మరీ అంత దారుణంగా గన్ పౌడర్ అని ఎలా చెపుతాడండీ? ఇది 9/11 కి ముందా?

    రిప్లయితొలగించండి
  6. హ హ భలే బాగున్నాయి మీ అయిస్ టి ,టెర్రరిస్ట్ విషయాలు ..:)

    రిప్లయితొలగించండి
  7. "గన్ పౌడర్" - కందిపొడి. విశాఖ,కొంత గోదారి పరీవాహక ప్రాంతాల్లోను అక్కడనించి లగెత్తుకొచ్చి ఐడ్రాబేడ్లోనూ సెటిలయిన సెట్లర్స్(హిహిహి)కూడా అలాగే పిలుస్తారు.దానికి అదేపేరు కరక్ట్ అంత పవర్‌ఫుల్ మరి.

    "తన జీవితంలో మరిచిపోలేని ఒక తప్పు అది. ఎందుకో తెలుసుకదా, హైదరాబాద్ అనగానే ఇక్కడ చికాగో వాళ్ళు అక్కడ అమ్మానాన్నలకి ఫోన్లు చెయ్యడం, వాళ్ళూ పొడులు పచ్చళ్ళూ ఇచ్చెయ్యడం జరిగిపోయాయి. "చచ్చాన్రా దేవుడా"

    చావక చస్తాడా మరి ఇంకెప్పుడూ చెయ్యడు అలాగ.

    రిప్లయితొలగించండి
  8. పాపం సింగ్ గారు ! పాపం పోలీసు గారు !!!

    రిప్లయితొలగించండి
  9. Ranjita is searching for another swamy, desperately in Kerala - News

    రిప్లయితొలగించండి
  10. నేను కారప్పొడిని గన్ పౌడర్ అంటారని తెలుసు. కంది పొడిని కూడా అంటారా..

    రిప్లయితొలగించండి